బంగ్లా పోరాటం: విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా

బంగ్లా పోరాటం: విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా

Updated On : November 23, 2019 / 3:20 PM IST

రెండో రోజు ఆటలోనూ బంగ్లాపై ఆధిక్యం కొనసాగించింది భారత్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి మించిన స్కోరుతో రికార్డులు కొల్లగొట్టాడు. కోహ్లీతో పాటు పూజారా, రహానెల సెంచరీలతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 

 

ఓవర్ నైట్ స్కోరు 174/3తో బరిలోకి దిగిన టీమిండియా..  347/9పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే 4వికెట్లు పోగొట్టుకుంది. వికెట్లు పడుతుంటే ముష్ఫికర్ రహీమ్(59 నాటౌట్; 70 బంతుల్లో 10ఫోర్లు)తో క్రీజులో నిలిచి వికెట్లు పతనాన్ని అడ్డుకున్నాడు. మెహిదీ హసన్(15), తైజుల్ ఇస్లామ్(11)తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. 

 

అంతకంటే ముందు దిగిన బ్యాట్స్ మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైయ్యారు. వారిలో షాద్‌మాన్ ఇస్లామ్(0), మోమినుల్ హక్(0) డకౌట్లుగా వెనుదిరగ్గా ఇమ్రుల్ కయీస్(5), మొహమ్మద్ మిథున్(6)పరుగులతో సరిపెట్టుకున్నారు. 

 

తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (136: 194 బంతుల్లో 18ఫోర్లు) సెంచరీకి తోడు వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51: 69 బంతుల్లో 7ఫోర్లు) పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌట్ అవడంతో టీమిండియాకి 241 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. 

 

రహానెతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్.. ఆ తర్వాత జడేజా (12), సాహా (17 నాటౌట్)లతో పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. కోహ్లీ ఔట్ తర్వాత వచ్చిన అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్ (0), ఇషాంత్ శర్మ (0) తేలిపోతుండటంతో సాహాతో కలిసి షమీ (10 నాటౌట్) క్రీజులో ఉండగా కోహ్లీ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ ప్రకటించాడు.