IPL 2025: కోల్‌కతాపై భారీ విజయంతో నిష్క్రమించిన హైదరాబాద్..

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2025: కోల్‌కతాపై భారీ విజయంతో నిష్క్రమించిన హైదరాబాద్..

Courtesy BCCI

Updated On : May 26, 2025 / 12:02 AM IST

IPL 2025: భారీ విజయంతో ఐపీఎల్ 2025 టోర్నీకి ముగింపు పలికింది సన్ రైజర్స్ హైదరాబాద్. కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయదుంధుబి మోగించింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన తర్వాత జోరు పెంచిన హైదరాబాద్.. తమ ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్ పై చెలరేగిపోయింది. హ్యాట్రిక్ విజయంతో ఈ సీజన్‌కు గుడ్ బై చెప్పింది.

కేకేఆర్ తో మ్యాచ్ లో కాటేరమ్మ కొడుకులు విశ్వరూపం చూపించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. 279 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 168 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 110 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది ఎస్ఆర్ హెచ్.

కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37), హర్షిత్ రానా(34), సునీల్ నరైన్ (31) రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్, ఎషాన్ మలింగా, హర్ష్ దూబే తలో మూడు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. 3 వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసింది. ఐపీఎల్ లో ఇది మూడో అత్యధిక స్కోర్. హైదరాబాద్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 39 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ట్రావిస్ హెడ్ కూడా చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 76 పరుగులు చేశాడు.

Also Read: టేబుల్ టాపర్ గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన చెన్నై.. ఘన విజయంతో ముగింపు..

ముఖ్యంగా కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వీరబాదుడు బాదాడు. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించాడు. ఏకంగా 9 సిక్సులు, 7 ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో ఫాస్టెస్ట్ శతకం.

సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిన తీరు చూసి.. ఈసారి 300 స్కోర్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. తన పేరిట ఉన్న 287/3 స్కోర్ రికార్డును ఎస్ఆర్ హెచ్ తిరగరాయడం పక్కా అనుకున్నారు. అయితే చివరి ఓవర్‌లో 17 పరుగులే రావడంతో కొత్త రికార్డ్ నమోదు కాలేదు. కాగా, ఐపీఎల్‌లో కేకేఆర్ కు ఇది అతిపెద్ద ఓటమి. అంతకుముందు 2018లో ముంబైపై 102 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. 2019లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ 118 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.

ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలు..
క్రిస్ గేల్ (ఆర్సీబీ) – 30 బంతుల్లో సెంచరీ – 2013లో- పంజాబ్ వారియర్స్ పై
వైభవ్ సూర్యవంశీ (ఆర్ఆర్) – 35 బంతుల్లో సెంచరీ – 2015లో – గుజరాత్ టైటాన్స్ పై
యూసుఫ్ పఠాన్ (ఆర్ఆర్) – 37 బంతుల్లో సెంచరీ- 2010లో- ముంబై ఇండియన్స్ పై
హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్ హెచ్) – 37 బంతుల్లో సెంచరీ – 2025లో – కేకేఆర్ పై
మిల్లర్ (కింగ్ ఎలెవన్ పంజాబ్) – 38 బంతుల్లో సెంచరీ – 2013లో- ఆర్సీబీపై