IPL2022 DC Vs LSG : దంచికొట్టిన డికాక్.. ఉత్కంఠపోరులో ఢిల్లీపై లక్నో విజయం
ఢిల్లీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది.

Ipl2022 Dc Vs Lsg
IPL2022 DC Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ కేపిటల్స్ పై లక్నో జట్టు విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది.
లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్ దంచికొట్టాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ (24), ఎవిన్ లూయిస్ (5), దీపక్ హుడా (11) నిరాశపరిచారు. కృనాల్ పాండ్య (19*), ఆయుష్ బదోనీ (10*) రాణించారు. చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకి విజయాన్ని అందించాడు యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనీ. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు.(IPL2022 DC Vs LSG)
లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఈ మెగా టోర్నీలో లక్నో జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు మూడు మ్యాచులు ఆడితే ఓ మ్యాచులో గెలుపొంది, రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది.
IPL2022 KKR Vs MI : కుమ్మేసిన కమిన్స్.. కోల్‌కతా ఖాతాలో మూడో విజయం..ముంబై హ్యాట్రిక్ పరాజయం
డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్నోకి 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. షా స్కోర్ లో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (36 బంతుల్లో 39 పరుగులు-నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 పరుగులు-నాటౌట్) రాణించారు. డేవిడ్ వార్నర్ (12 బంతుల్లో 4 పరుగులు), రోమన్ పావెల్(3) నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ తీశాడు.(IPL2022 DC Vs LSG)
హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడాలకున్న పృథ్వీ షా జోరుకు బ్రేకులు వేశాడు కృష్ణప్ప గౌతమ్. ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా(61) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పృథ్వీ. క్రీజులో ఉన్నంతసేపు పృథ్వీ షా ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పృథ్వీ షా ఔట్ అయ్యాక ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. 4 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే.. రవి బిష్ణోయి బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్(3) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 74 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయింది.
లక్నో జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. మనీశ్ పాండే స్థానంలో జట్టులోకి స్పిన్ ఆల్ రౌండర్ క్రిష్ణప్ప గౌతమ్ ను తీసుకుంది లక్నో. ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్, సర్ఫరాజ్ ఖాన్ అందుబాటులోకి వచ్చారు. ఇప్పటికే వార్నర్ క్వారంటైన్ పూర్తి చేసుకోగా.. నోర్జ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. డేవిడ్ వార్నర్ రాకతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన టిమ్ సీఫెర్ట్‌పై వేటు పడింది.
జట్ల వివరాలు..
లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
ఢిల్లీ కేపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, రోమన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్జ్, ముస్తాఫిజుర్ రహ్మాన్