GT vs CSK : ఆర్‌సీబీ, పంజాబ్ బాటలోనే గుజరాత్ పయనిస్తుందా? చెన్నై షాకిస్తే టాప్-2లో ప్లేస్ గల్లంతే..
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా మూడు రోజులు ఇదే తంతు. గుజరాత్‌కు లక్నో, బెంగళూరుకు సన్‌రైజర్స్, పంజాబ్‌కు ఢిల్లీ జట్లు షాక్‌లు ఇచ్చాయి.

Courtesy BCCI
హమ్మయ్యా.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాం.. ఇక టాప్-2లో చోటు ఖాయం చేసుకోవాలి అనుకుంటుంది ఓ జట్టు. కానీ ప్లేఆఫ్స్‌కు దూరం అయ్యాక ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి అవకాశాలను దెబ్బ తీస్తుంది అవతలి జట్టు. ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా మూడు రోజులు ఇదే తంతు. గుజరాత్‌కు లక్నో, బెంగళూరుకు సన్‌రైజర్స్, పంజాబ్‌కు ఢిల్లీ జట్లు షాక్‌లు ఇచ్చాయి.
ఇక ఆదివారం నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు అరుణ్ జైట్లీ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టనుంది.
ఇప్పటికే సన్‌రైజర్స్, కోల్‌కతాలు ప్లేఆఫ్స్ రేసులో లేకపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగానే మారింది. మరోవైపు గుజరాత్‌కు మాత్రం చెన్నైతో మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధిస్తే గుజరాత్ 20 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం అప్పుడు కూడా టాప్-2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మిగిలిన జట్ల ఫలితాల పై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ.. చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఓడిపోతే, అదే సమయంలో ఆర్‌సీబీ, పంజాబ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు గుజరాత్ జట్టు టాప్-2లో ఉండదు. కాబట్టి చెన్నైతో మ్యాచ్ గుజరాత్ కు ఎంతో కీలకం. గత మూడు రోజులు జరిగినట్లుగానే చెన్నై జట్టు గుజరాత్ కు షాకిస్తుందా? లేదా చూడాలి.