Virat Kohli : కోల్‌కతాతో మ్యాచ్.. అరుదైన రికార్డు పై కోహ్లీ కన్ను..
బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిపై కన్నేశాడు.

Kohli needs 38 runs to become 3rd batter in IPL history to achieve massive feat against KKR
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు (మార్చి 22) రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
కాగా.. బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిపై కన్నేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లీ 38 పరుగులు చేస్తే.. కోల్‌కతాపై 1000 పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. కేకేఆర్ పై కోహ్లీ ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్‌ల్లో 38.48 సగటుతో 962 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఆరు హాఫ్ సెవంచరీలు ఉన్నాయి.
ఇక కేకేఆర్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 43.72 సగటుతో 1,093 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థశతకాలు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 34 ఇన్నింగ్స్‌ల్లో 39.62 సగటుతో 1,070 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఆరు అర్థశతకాలు ఉన్నాయి.
కోహ్లీ ఇప్పటి వరకు మూడు వేర్వేరు ఐపీఎల్ జట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ పై కోహ్లీ 1000 కి పైగా రన్స్ చేశాడు. మరే ఆటగాడు కూడా రెండు కంటే ఎక్కువ జట్లపై వెయ్యిపరుగులు చేయలేదు. డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలు ఇద్దరూ కూడా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ లపై 1000 కంటే ఎక్కువ పరుగులు చేశారు.
ఒకే ఫ్రాంచైజీ..
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే ఒక ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపుననే కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 244 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 8004 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 55 అర్థశతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు.
ఇక రెండో స్థానంలో శిఖర్ ధావన్ (6769 పరుగులు) ఉన్నాడు. అయితే.. ధావన్ ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మూడో స్థానంలో రోహిత్ శర్మ 252 ఇన్నింగ్స్‌ల్లో 6628 పరుగులతో ఉన్నాడు.