మూడో టెస్టుకు హాజరుకానున్న ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం వేదికగా టీమిండియాలో ఉత్సాహాన్ని నింపేందుకు రానున్నాడు.
ఈ సందర్భంగా ధోనీ మేనేజర్ దివాకర్ మాట్లాడుతూ.. ‘మహీ కచ్చితంగా వస్తాడు. మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటకు ధోనీ స్టేడియంలో కనిపిస్తాడు. ధోనీతో పాటు ముంబైలో ఉన్నాం. రేపు ఉదయానికల్లా చేరుకుంటాం’ అని వెల్లడించాడు.
టీమిండియా ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ లో రెండింటిలో గెలిచి ఆధిక్యం దక్కించుకుంది. నామమాత్రమైన మూడో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవగా పరువు నిలుపుకోవాలని సఫారీలు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా నామినేషన్ వేసిన గంగూలీ దీనిపై స్పందించాడు. ‘ఎన్నాళ్లని ఈ సందిగ్ధం. అక్టోబరు 24న సెలక్టర్లతో మీటింగ్ ఉంది. ఆ రోజు నా అభిప్రాయాన్ని వాళ్ల ముందు ఉంచుతాను. అప్పుడే తెలుస్తుంది ధోనీకి ఏం కావాలో. అదే పనిలో ఉన్నాం. ధోనీ చెప్పినదాన్ని బట్టి మున్ముందు ఏం చేయాలో ఆలోచిస్తాం’ అని గంగూలీ మీడియా ముందు చెప్పుకొచ్చాడు.