Champions Trophy 2025 : కమిన్స్, హేజిల్‌వుడ్, మార్ష్, గ్రీన్, స్టోయినిస్.. ఒక్కరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం లేదు.. ఇక ఆస్ట్రేలియా జట్టులో ఉన్నది ఎవరంటే ?
ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కమిన్స్, హేజిల్‌వుడ్, మార్ష్, గ్రీన్, స్టోయినిస్ లలో ఒక్కరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం లేదు.

No Cummins Hazlewood Marsh Green and Stoinis for Australia at the Champions Trophy 2025
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నీలో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. 2017లో చివరి సారిగా ఈ మెగాటోర్నీ జరిగింది. దాదాపు 8 ఏళ్ల తరువాత ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా జరగనుంది. ఈ మెగాటోర్నీ కోసం అన్ని జట్లు సమాయత్తం అవుతున్నాయి. టోర్నీ విజేతగా నిలవాలని అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడంతో పాటు తమ ప్రధాన ప్లేయర్లను బరిలోకి దించుతున్నాయి. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.
మిగతా జట్ల సంగతి ఎలా ఉన్నా సరే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మాత్రం ఆస్ట్రేలియాకు భారీ షాకులు తగులుతున్నాయి. మెగాటోర్నీకి జట్టును ఎంపిక చేసే ముందే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. ఆ తరువాత 15 మందితో కూడిన స్కాడ్‌ను ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇందులో స్టార్ ఆటగాడు కామెరూన్ గ్రీన్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు మరో ముగ్గురు ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యారు.
🚨 PAT CUMMINS AND JOSH HAZLEWOOD OUT OF CT. 🚨
– No Cummins, Hazlewood, Marsh, Green and Stoinis for Australia at the Champions Trophy. 🤯 pic.twitter.com/hzzWDXQpPx
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025
కెప్టెన్ కమిన్స్‌తో పాటు పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌లు గాయాలతో సతమతం అవుతున్నారు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి వీరిద్దరూ కోలుకుంటారని ఆసీస్ సెలక్టర్లు భావించి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడినా ఈ ఇద్దరూ ఆటగాళ్లు కోలుకోలేదు. దీంతో వీరిద్దరు ఈ మెగాటోర్నీకి దూరం అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అనూహ్యంగా నేడు (ఫిబ్రవరి 6) న వన్డేలకు రిటైర్‌మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పాడు. దీంతో ఇతడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయినట్లే. అయితే.. వీళ్ల స్థానాల్లో ఇంకా ఎవరిని క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయలేదు. ఫిబ్రవరి 12 లోపు జట్లలో మార్పులు చేసుకునేందుకు సమయం ఉండడంతో అప్పటిలోగా వీళ్ల స్థానాలను వేరే ఆటగాళ్లతో భర్తీ చేయనుంది. చూస్తుంటే ఇంకెంత మంది ఆటగాళ్లు టోర్నీ ప్రారంభానికి దూరం అవుతారోనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆస్ట్రేలియా జట్టులో ఏం జరుగుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడంతో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్‌లలో ఒకరు నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఆస్ట్రేలియా కోచ్ మెక్ డొనాల్డ్ చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్టర్లు ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్ ( మరో కొత్త ఆటగాడు ఇతడి స్థానంలో రానున్నాడు).