IND vs NZ Semi Final Match : ఇండియా – కివీస్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆ గంటసేపు చాలా కీలకం.. ఏమైనా జరగొచ్చు..! ఎందుకంటే?
వరల్డ్ కప్ 2023లో వాంఖడే స్టేడియంలో నాలుగు మ్యాచ్ లు జరిగాయి. మొదటి ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి, రెండో ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి బ్యాటర్లు పరుగులు రాబట్టే విషయంలో చాలా తేడా ఉంది.

India vs NZ semi final match
ODi World Cup 2023 IND vs NZ : భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం నేడు జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఈ మ్యాచ్ లో విజయం ఏ జట్టును వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే, వాఖండే స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో టాస్ కీలక భూమిక పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. వరల్డ్ కప్ 2023లో ఈ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. ఆస్ట్రేలియా జట్టు మాత్రం రెండో ఇన్సింగ్ లో బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. ఆ విజయంకూడా అంతతేలిగ్గా రాలేదు.. ఉత్కంఠ పోరులో అఫ్గాన్ పై ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఆసీస్ గెలిచింది.
వాఖండే స్టేడియంలో రెండోసారి బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. ఒకవేళ రెండో దఫా బ్యాటింగ్ చేయాల్సి వస్తే మొదటి గంటసేపు చాలా కీలకం. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు రెండో దఫా బ్యాటింగ్ చేసే బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఆ సమయంలో బాల్ వేగంగా దూసుకొస్తుంది. దీనికి ప్రధాన కారణంకూడా ఉంది. అరేబియా సముద్రం పక్కన వాంఖడే స్టేడియం ఉంది. సాయంత్రం సమయంలో సముద్రపు గాలి ప్రభావంతో బాల్ వేగంగా దూసుకొస్తుంది. ఈ క్రమంలో బ్యాటర్లు ఔట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల సమయంలో బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో పాతకుపోయేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత బ్యాటర్లకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరుగులు రాబట్టేందుకు సులభతరం అవుతుంది.
వరల్డ్ కప్ 2023లో వాంఖడే స్టేడియంలో నాలుగు మ్యాచ్ లు జరిగాయి. మొదటి ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి, రెండో ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి బ్యాటర్లు పరుగులు రాబట్టే విషయంలో చాలా తేడా ఉంది. గత నాలుగు మ్యాచ్ లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లు మొదటి పవర్ ప్లేలో 67/4, 35/3, 14/6 మరియు 52/4 మంచి ప్రదర్శన ఇవ్వలేదు. రెండో దఫా బ్యాటింగ్ చేసి గెలిచిన ఆస్ట్రేలియా జట్టుసహా మొదటి పది ఓవర్లలో ఎక్కువ వికెట్లు కోల్పోయాయి..
Also Read : Aishwarya Rai : ఐశ్వర్య రాయ్‌కు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు
ఈ గణాంకాల ప్రకారం.. ఈరోజు వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో టాస్ కీలకం అవుతుంది. మొదటి బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా టాస్ ఓడి రెండో బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. మొదటి పది ఓవర్లు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రాధాన్యతనిస్తే ఆ తరువాత ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.