Harbhajan Singh : పాక్ మాజీ కెప్టెన్ పై హర్భజన్ సింగ్ ఆగ్రహం.. అర్థంలేని మాటలు మాట్లాడొద్దంటూ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
ప్రఖ్యాత పాకిస్థానీ ఇస్లామిక్ టెలివిజన్ బోధకుడు మౌలానా తారిఖ్ జమీల్ గురించి ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతున్న వీడియో ఉంది. మేము అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో మాతో ఆయన మాట్లాడేవాడు.

Inzamam-ul-Haq and Harbhajan Singh
Harbhajan Singh SLAMS Inzamam-Ul-Haq : భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్ధం లేని మాటలు మాట్లాడొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగుతున్నవేళ హర్భజన్ పాక్ మాజీ కెప్టెన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయానికి వెళితే.. ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్థాన్ కెప్టెన్ గా ఉన్న సమయంలో భారత్ – పాకిస్థాన్ జట్లు అనేక మ్యాచ్ లు ఆడాయి. గతంలో ఇరు జట్లు ఓ సిరీస్ లో ఆడే సమయంలో ఇలా జరిగిందంటూ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రఖ్యాత పాకిస్థానీ ఇస్లామిక్ టెలివిజన్ బోధకుడు మౌలానా తారిఖ్ జమీల్ గురించి ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతున్న వీడియో ఉంది. మేము అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో మాతో ఆయన మాట్లాడేవాడు. సాయంత్రం ప్రార్థనల తరువాత ఇస్లాంను ప్రబోదించేవాడని చెప్పాడు. ఓ సిరీస్ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ టీంతో కలిసి భారత్ కు చెందిన పలువురు క్రికెటర్లుకూడా హాజరయ్యేవారని ఇంజమామ్ చెప్పాడు. ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్ లు మా ఆహ్వానం మేరకు ప్రార్థనల సెషన్ లలో మాతోపాటు చేరేవారని, వీరిలో హర్భజన్ కూడా ఒకరని, ఈ క్రమంలో మత బోధకుడు బోధనల పట్ల ప్రభావితమయ్యాడని ఇంజమామ్ తెలిపాడు. మతం మారాలనే కోరికనుకూడా నా వద్ద హర్భజన్ వ్యక్తపర్చాడని ఇంజమామ్ పేర్కొన్నాడు. వీరితోపాటు ఇద్దరుముగ్గురు భారతీయ ఆటగాళ్లు కూడా తమతో హాజరయ్యేవారని ఇంజమామ్ ఉల్ హక్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంజమామ్ వ్యాఖ్యలకు భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అలాంటి అర్థంలేని మాటలు మాట్లాడే ముందు అతను ఏమి తాగాడు? నేను గర్వించదగిన భారతీయుడను, గర్వించదగిన సిక్కును అని పేర్కొన్నాడు. ఇంజమామ్ వీడియో పట్ల పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. హర్భజన్ భారత జట్టుతో కలిసి పాకిస్థాన్ లో పలు పర్యటనల్లో ఉన్నాడు. ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇద్దరూ లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఓ వీడియోలో గతంలో ఇండియా వర్సెస్ పాక్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణలు, చిరస్మరణీయ క్షణాల గురించి మాట్లాడారు.
హర్భజన్ సింగ్ 2021 డిసెంబర్ 24న అన్నిరకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆఫ్ స్పిన్నర్ అద్భుతమైన ఆట తీరుతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 711 వికెట్లు తీశాడు.
Yeh kon sa nasha pee kar baat kar raha hai ? I am a proud Indian and proud Sikh..yeh Bakwaas log kuch bi bakte hai ????? https://t.co/eo6LN5SmWk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 14, 2023