Asia Cup 2025 : ఆపరేషన్ తిలక్.. అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. తొమ్మిదోసారి ఆసియా కప్ సొంతం చేసుకున్న టీమిండియా

Asia Cup Final Operation Tilak ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీగా ప్రైజ్‌మనీని ప్రకటించింది.

Asia Cup 2025 : ఆపరేషన్ తిలక్.. అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. తొమ్మిదోసారి ఆసియా కప్ సొంతం చేసుకున్న టీమిండియా

Asia Cup Final Operation Tilak

Updated On : September 29, 2025 / 8:15 AM IST

Asia Cup Final Operation Tilak : ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, చివరిలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు కుర్రాడు.. టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించి విజయతీరాలకు చేర్చాడు.

Also Read: Asia Cup 2025 Final : మేము అందుకే ఓడిపోయాం.. ఫైనల్లో ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక కామెంట్స్..

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్లు పర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించారు. ఆ తరువాత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం, బుమ్రా అద్భుత బంతులతో మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే వెంటవెంటనే పెలియన్ బాటపట్టారు. 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (12) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) కూడా వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69నాటౌట్), సంజూ శాంసన్ (24), శివమ్ దూబె( 33) రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.


ముఖ్యంగా తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ చేశాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో టీమిండియా ఆసియా కప్ లో తొమ్మిదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.
1984లో తొలి ఆసియాకప్ లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆ తరువాత 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023లో కప్ నెగ్గింది. తాజాగా.. 2025లో టీమిండియా విజేతగా నిలిచింది.

భారత్ జట్టు విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఆపరేషన్ తిలక్ అనే అర్ధం వచ్చేలా ట్వీట్ లో పేర్కొన్నారు. ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్‌దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’ అని మోదీ ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీగా ప్రైజ్ మనీని ప్రకటించింది. రూ.21కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. దీన్ని ప్లేయర్లతోపాటు సపోర్ట్ స్టాఫ్ కు అందిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు.. పాకిస్థాన్ పై అద్భుత విజయంతో టోర్నీ విజేతగా నిలిచిన టీమిండియా.. ఆసియాకప్ ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండటమే  ఇందుకు కారణం. ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండా టీమిండియా దూరంగా ఉండిపోయింది.