IPL 2025 : బెంగళూరు కెప్టెన్ అతడేనా? నాయకత్వం వద్దన్న కోహ్లీ!
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు అన్న ఆసక్తి అందరిలో ఉంది.

Rajat Patidar to be new skipper of RCB Reports
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్లు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు కప్పు కొట్టని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒకటి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ జట్టు సొంతం. కోహ్లీ, డివిలియర్స్ , గేల్ వంటి ఎందరో ఆటగాళ్లు ఆడినా కూడా ఆ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. ప్రతిసారి కప్పు మనదే అంటూ రావడం ఊసూరు మనిపించడం ఆజట్టుకు అలవాటుగా మారింది.
కోహ్లీ సారథ్యంలో టైటిల్‌ను అందుకోలేకపోయిన ఆర్‌సీబీ తమ జట్టు తలరాతను డుప్లెసిస్ మారుస్తాడని భావించింది. అతడి నాయకత్వంలోనూ ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలవలేకపోయింది. దీంతో డుప్లెసిస్‌ను మెగావేలానికి వదిలివేసింది. కనీసం అతడి కోసం బిడ్‌ను కూడా వేయలేదు. నాణ్యమైన ఆటగాళ్లను ఈ సారి వేలంలో దక్కించుకుంది. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆ జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తారు అన్న ప్రశ్న అందరిలో నెలకొంది.
CCL 2025 : ఒక్క టికెట్ కొంటే రెండు మ్యాచ్‌లు.. సీసీఎల్ బంపర్ ఆఫర్ !
రజత్ పాటిదార్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడు అన్న ప్రచారం సాగింది. అయితే.. కోహ్లీ మాత్రం నాయకత్వ బాధ్యతలు అందుకునేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో యువ ఆటగాడు రజత్ పాటిదార్ పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న ఈ యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ప్రకటించడమే మిగిలి ఉందని పలు రిపోర్టులు చెబుతున్నాయి.
కెప్టెన్ గా అనుభవం ఉందా?
పాటిదార్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 428 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. 27 మ్యాచ్‌లు ఆడాడు. 34.7 సగటుతో 158.8 స్ట్రైక్‌రేటుతో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 112.
రెండో ఆప్షన్ ఇతడే..
ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా రెండో ఆప్షన్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కృనాల్ ఇప్పటికే బరోడాకు కెప్టెన్‌గా దేశవాలీలో తనదైన ముద్ర వేశాడు. కృనాల్ పాండ్యా ఇప్పటి వరకు 127 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు 22.6 సగటుతో 1647 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఇక బౌలింగ్‌లో 76 వికెట్లు సాధించాడు.