IPL 2025 final: ఐపీఎల్ ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్..
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు.

BCCI
IPL 2025 final Match: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. ఆ రెండూ తొలి కప్పు కోసం 18ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో అంతిమ సమరంపై క్రికెట్ ఫ్యాన్స్ లో అమితాసక్తి నెలకొంది.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సోమవారం మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు విశేషమైన కృషి చేశాడు. ఆ కల నెరవేర్చుకునే సమయం మళ్లీ వచ్చింది. ఆర్సీబీ ఫైనల్ లో విజయం సాధించి టైటిల్ గెలవడం విరాట్ కోహ్లీకి, ఆర్సీబీ ఫ్యాన్స్ కు చాలా ముఖ్యమైంది. మేము విరాట్ కోహ్లీ కోసం ఈ ట్రోఫీని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని చెప్పాడు.
‘‘గెలుపోటములపై తమ జట్టు సభ్యులు ఎక్కువగా ఆలోచించరు. తమ అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే దృష్టిసారిస్తారు. ఆర్సీబీ లాంటి జట్టు పైనల్‌లో ఆడేటప్పుడు అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కానీ, నేను ఎల్లప్పుడూ నా నియంత్రణలో ఉన్నదానిపై దృష్టి పెడతాను. వర్తమానంలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ కెప్టెన్సీ ప్రయాణం నాకు గొప్ప అనుభవంగా మారింది. జట్టులో అత్యుత్తమ దిగ్గజాలు, విదేశీ ఆటగాళ్లతో ఉండటం నిజంగా నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’’ అని చెప్పారు.
‘‘ఫైనల్ మ్యాచ్‌కు ముందు టిమ్ డేవిడ్ ఫిట్‌నెస్ గురించి రజత్ పాటిదార్ ఒక అప్‌డేట్ ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవన్‌లో ఉంటాడా లేదా అనే దానిపై చివరి క్షణంలో వైద్యబృందం నిర్ణయం తీసుకుంటుందని రజత్ పాటిదార్ అన్నాడు. డేవిడ్ సకాలంలో కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
Rajat Patidar said, “we’ll try to win this IPL for Virat Kohli”. ❤️ pic.twitter.com/N4v0qAC6IG
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2025
18ఏళ్లుగా ఆర్సీబీ అభిమానులు టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు. 2008లో జరిగిన ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. కోహ్లీ 2013 నుంచి 2021 వరకు జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఆర్సీబీ ఇప్పటి వరకు 2009, 2011, 2016 సీజన్ లలో ఫైనల్స్ ఆడింది. ఈ మూడు సందర్భాల్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నాడు. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా ఐపీఎల్ టైటిల్ విజేతగా ఆర్సీబీ నిలవలేదు.
2025 ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. లీగ్ దశలో రెండు సార్లు తలపడగా.. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి.