Rohit Sharma : రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్‌ల కోచింగ్ తీరుపై రోహిత్ శర్మ కామెంట్స్..
భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు ఆడనుంది.

Rohit Sharma Has 2 Words For Gautam Gambhir And New India Support Staff
Rohit Sharma – Gautam Gambhir : భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌తో పని చేయడం గురించి మాట్లాడాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, గంభీర్‌కు మధ్య తేడాలను వివరించాడు. ఇద్దరి శైలి వేరుగా ఉందన్నాడు.
‘ఖచ్చితంగా రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్ (మాజీ బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (మాజీ బౌలింగ్ కోచ్) ఓ భిన్నమైన జట్టు. కొత్త సహాయక సిబ్బంది విభిన్న దృక్కోణాన్ని తీసుకురావడం మాత్రం ఆమోదయోగ్యమైనది.’ అని రోహిత్ శర్మ తెలిపాడు. కొత్త కోచింగ్ స్టాఫ్ స్టయిల్ వేరుగా ఉందని, అయినప్పటికి సమస్యలేదన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. శ్రీలంక పర్యటనతో గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలను చేపట్టాడు. గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్ (అసిస్టెంట్ కోచ్), దక్షిణాఫ్రికా ఆటగాడు మోర్నే మోర్కెల్ (బౌలింగ్ కోచ్), మాజీ డచ్ ఆల్-రౌండర్ ర్యాన్ టెన్ డోస్చాట్ (అసిస్టెంట్ కోచ్) లు ఉన్నారు.
గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్ లు తనకు చాలా కాలంగా తెలుసునని రోహిత్ శర్మ చెప్పాడు. ప్రతి సహాయక సిబ్బందికి దాని నిర్వహణ శైలి ఉంటుంది. తాము ఆశించేది కూడా అదేనన్నాడు. ఇక తన కెరీర్‌లో 17 సంవత్సరాల పాటు వేర్వేరు కోచ్‌లతో కలిసి ఆడిన విషయాన్ని హిట్‌మ్యాన్ గుర్తు చేశాడు. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదన్నాడు.
IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్.. ఫ్రీగా మ్యాచులను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇక చాలా కాలం తరువాత టీమ్ఇండియా టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ విరామం ఆటపై ప్రభావం చూపుతుందా? అని రోహిత్‌ను ప్రశ్నించగా పెద్దగా ఉండదని అన్నాడు. చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న ప్లేయర్లు అంతా దులీఫ్ ట్రోఫీలో ఆడారని చెప్పుకొచ్చాడు. ఇక బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం లేదన్నాడు. ప్రతి మ్యాచులోనూ తాము విజయం కోసమే ఆడతామని చెప్పాడు.