Mark Boucher : రోహిత్ శర్మ భవిష్యత్తుపై ముంబై కోచ్ బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. గత రాత్రే మాట్లాడా..
రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Rohit slams with an iconic answer when MI coach Boucher asks whats next
Mark Boucher – Rohit Sharma : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. 14 మ్యాచుల్లో కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. మొత్తంగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించింది. కాగా.. ఈ సీజన్‌ను ముందు జట్టుకు ఐదు సార్లు కప్పును అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది ముంబై ఇండియన్స్. ఈ క్రమంలో రోహిత్‌కు ఇదే చివరి సీజన్ అని, జట్టును వీడుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తనకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో రోహిత్ అత్యంత సమర్థుడు అని చెప్పాడు. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. అందులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అని లక్నోతో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్క్ బౌచర్ తెలిపాడు. గత రాత్రి కూడా రోహిత్ శర్మతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో వైఫల్యాల గురించి చర్చించినట్లు తెలిపాడు. తరువాత ఏంటి ? అని అతడిని అడుగగా టీ20 ప్రపంచకప్ అని సమాధానం ఇచ్చాడని బౌచర్ వెల్లడించాడు.
కాగా.. రోహిత్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ముంబైని రోహిత్ వీడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు.
ఈ సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ శర్మ ఆ తరువాత తేలిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగు మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లోనే 68 పరుగులు చేసి టీ20 ప్రపంచకప్‌కు ముందు ఫామ్‌ను అందుకున్నాడు. ఇక లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రోహిత్ 417 పరుగులు చేశాడు.