IPL 2025: సీఎస్‌కేను దారుణంగా దెబ్బకొట్టిన రొమారియో షెపర్డ్.. చివరి రెండు ఓవర్లలో విధ్వంసం.. ఎంఎస్ ధోనీ ఏమన్నాడంటే..?
చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ జట్టు స్కోర్ 213 పరుగులకు చేరింది.

Romario Shepherd Fastest Fifty In IPL 2025: ఐపీఎల్-2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే జట్టు రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సీఎస్కే జట్టు విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సీఎస్కే జట్టు 211 పరుగులు చేసింది. దీంతో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, సీఎస్కే జట్టు ఓటమికి రొమారియో షెపర్డ్ విధ్వంసకర బ్యాటింగ్ కూడా ఓ కారణం.
ఆర్సీబీ బ్యాటర్ రొమారియో షెపర్డ్ చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతను తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా సీఎస్కే బౌలర్ ఖాలీల్ అహ్మద్ కు చుక్కలు చూపించాడు. ఖాలీల్ 19వ ఓవర్ వేయగా షెపర్డ్ నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు రాబట్టాడు. మతీషా పతిరనా 20వ ఓవర్ బౌలింగ్ చేయగా.. మొదటి బంతికే టీమ్ డేవిడ్ ఒక పరుగు తీసి రొమారియోకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తరువాత రెండు సిక్సులు, రెండు ఫోర్లతో షెపర్డ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ప్లేయర్ గా కేఎల్ రాహుల్, కమ్మిన్స్ సరసన షెపర్డ్ నిలిచాడు.
చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ జట్టు స్కోర్ 213 పరుగులకు చేరింది. మ్యాచ్ అనంతరం షెపర్డ్ బ్యాటింగ్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆఖరి ఓవర్లలో షెఫర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బంతి ఎలా వేసినా సిక్స్ లు బాదేయగలిగాడు’’ అంటూ పేర్కొన్నాడు. షెఫర్డ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేసుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి ఉండేదన్న అభిప్రాయాన్ని ధోనీ వ్యక్తం చేశాడు.
THE HISTORIC MOMENT IN RCB – ITS BY ROMARIO 🎯 pic.twitter.com/nyH9Lv50k9
— Johns. (@CricCrazyJohns) May 3, 2025
🚨 ROMARIO SHEPHERD HAS THE FASTEST FIFTY FOR RCB IN IPL HISTORY. 🚨
– 2nd fastest in IPL history. 🤯 pic.twitter.com/5xf1LNwUv6
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025