Mohammed Shami : రోహిత్, ద్రవిడ్‌లపై షమీ కౌంటర్లు.. మళ్లీ ఆ ఇద్దరికి ఆ ఆలోచన రాలేదు
టీమ్ఇండియా అత్యుత్తమ బౌలర్లలో మహ్మద్ షమీ ఒకరు.
Mohammed Shami trolls : టీమ్ఇండియా అత్యుత్తమ బౌలర్లలో మహ్మద్ షమీ ఒకరు. తన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ముఖ్యంగా టెస్టులు, వన్డేల్లో తనదైన ముద్ర వేశాడు. అయినప్పటికీ స్వదేశంలో గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోని ప్రారంభ మ్యాచులకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్ పాండ్యా గాయపడడంతో షమీకి తుది జట్టులో అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఇటీవల సియాట్ క్రికెట్ అవార్డర్స్ సందర్భంగా దీని గురించి షమీకి ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై షమీ సరదాగా స్పందించాడు. తనకు ఛాన్స్ వచ్చిన తరువాత బాగా రాణించానని, దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు మళ్లీ తనను డ్రాప్ చేయాలనే ఆలోచన రాలేదన్నాడు.
‘2015, 2019, 2023లో వన్డే ప్రపంచకప్‌లలో ఆరంభ మ్యాచుల్లో నాకు అవకాశం దక్కలేదు. అయితే.. ఒక్కసారి అవకాశం వచ్చిన తరువాత మాత్రం అద్భుత ప్రదర్శనలు చేశాను. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతో వారు మళ్లీ నన్ను డ్రాప్ చేయాలని అనుకోలేదు. ఇది నాకు అలవాటే.’ అని షమీ అన్నాడు.
ఛాన్స్ వచ్చినప్పుడు సత్తా చాటేందుకు ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉండాలన్నాడు. అలా ఉన్నప్పుడే అవకాశం రాగానే సత్తా చాటుతామని, లేదంటే మైదానంలోని ఆటగాళ్లకు మంచి నీళ్లు ఇవ్వడానికి మాత్రమే పరిగెత్తాల్సి ఉంటుందన్నాడు. షమీ సరదాగా కౌంటర్లకు ద్రవిడ్, రోహిత్ లతో పాటు అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. గతేడాది వన్డే ప్రపంచకప్ తరువాత నుంచి షమీ భారత్ తరుపున మరో మ్యాచ్ ఆడలేదు. చీలమండల గాయంతో బాధపడ్డాడు. ఇటవలే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్ సమయానికి అతడు ఫిట్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Always ready, always hungry, always on top! 🙌🏻💪🏻#MohammedShami opens up on the drive that keeps him pushing forward, even after being benched in the early stages of the World Cup! 💥
Watch the Full episode – CEAT Cricket Awards on YouTube channel pic.twitter.com/ZJOkfryXpt
— Star Sports (@StarSportsIndia) September 2, 2024