Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ దరిద్రం కాకపోతే ఏంటి భయ్యా ఇది.. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదు.

Shreyas Iyer lost two back to back final matchs with in 10days
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదు. అదృష్టం తలుపు తట్టినట్లే తట్టి వెనక్కి వెళ్లిపోతున్నట్లుగా కనిపిస్తోంది. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే అతడు రెండు ట్రోఫీలను అందుకునే సువర్ణావకాశాలను కోల్పోయాడు.
జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఓడిపోగా.. జూన్ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్‌లో ఓడిపోయింది.
ముంబై టీ20 ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం సోబో ముంబై ఫాల్కన్స్, ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
మయురెష్ తండెల్ (50 నాటౌట్), హర్ష్ అగవ్(45 నాటౌట్) రాణించగా శ్రేయస్ అయ్యర్ (17 బంతుల్లో 12 పరుగులు) విఫలం అయ్యాడు. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ బౌలర్లలో వైభవ్ మాలీ రెండు వికెట్లు తీశాడు. ఆదిత్య ధుమాల్, మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టు లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. మరాఠా బ్యాటర్లలో చిన్మయ్ రాజేష్ సుతార్( 53) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. సోబో ముంబై ఫాల్కన్స్ బౌలర్లలో కార్తీక్ మిశ్రా, యశ్ దిచోల్కర్ తలా రెండు వికెట్లు తీశారు.
ఓ వైపు టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. అతడి నాయకత్వంలోని జట్లు వరుసగా ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోతుండడం గమనార్హం.