టీమిండియా మాజీ ఆటగాడికి షాక్ ఇచ్చిన అమెరికా.. ఉన్ముక్త్‌కు మొండిచేయి
అమెరికా జట్టు తరపున ఆడడానికి ఇండియాలో క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్‌కు భారీ షాక్ తగిలింది.

Unmukt Chand: భారత అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ T20 ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కి ప్రాతినిధ్యం వహించాలనే ఆశలు ఆవిరయ్యాయి. T20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా కెనడాతో ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమయ్యే T20I సిరీస్‌కు ఎంపిక చేసిన అమెరికా జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం సెలక్ట్ చేసిన 15 మంది సభ్యుల USA నేషనల్ టీమ్‌లో ఉన్ముక్త్‌కు మొండిచేయి చూపించారు.
అమెరికా జట్టులో స్థానం కోసమే అతడు ఇండియా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2021లో భారత క్రికెట్ నుండి రిటైర్ అయిన అతడు ఈ సంవత్సరం ప్రారంభంలో USAకి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించాడు. 45 మేజర్ లీగ్ క్రికెట్ (MLC) గేమ్‌లలో 1500 పరుగులు చేసి.. ఆ టోర్నీ చరిత్రలో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. T20 ప్రపంచ కప్‌లో టీమిండియాకు అపొజిట్‌గా ఆడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు అప్పట్లో ప్రకటించాడు.
కెప్టెన్‌గా మోనాంక్ పటేల్
కెనడాతో జరిగే T20I సిరీస్‌కు USA జట్టు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ కోరె అండర్సన్ కూడా ఆరేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయబోతున్నాడు. అతడు కూడా అమెరికా జట్టుకు సెలక్టయ్యాడు. 33 ఏళ్ల అండర్సన్ 2012 నుండి 2018 వరకు న్యూజిలాండ్ తరపున 13 టెస్టులు, 49 ODIలు, 31 T20Iలు ఆడాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా అతడు సాధించాడు. పలువురు భారత సంతతి ఆటగాళ్లు కూడా అమెరికా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం విశేషం. తెలుగు యువకుడు సాయితేజరెడ్డి ముక్కమల్లను రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకున్నారు.
Also Read: ఐపీఎల్‌లో అదో ఆనవాయితీ.. కేకేఆర్ జట్టు రూ.24.75 కోట్లు వృథా అయినట్లేనా..?
కెనడా T20I సిరీస్ USA జట్టు
మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, గజానంద్ సింగ్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టాయిక్, ఉస్మాన్ రఫీక్
రిజర్వ్ ప్లేయర్స్: షాయన్ జహంగీర్, జువానోయ్ డ్రైస్‌డేల్, సాయితేజరెడ్డి ముక్కమల్ల