IND vs NZ : చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..
టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు.

pic credit @ BCCI TWITTER
టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. కాగా.. వరుణ్ చక్రవర్తికి ఇది రెండో వన్డే మ్యాచ్ మాత్రమే.
ఇంతకముందు ఈ ఘనత టీమ్ఇండియా మాజీ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. బిన్నీ తన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
కివీస్ తో మ్యాచ్ ప్రదర్శనతో వరుణ్ మరో ఘనతను సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా.. కివీస్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శన..
రవీంద్ర జడేజా – 5/36 – 2013లో వెస్టిండీస్ పై
వరుణ్ చక్రవర్తి – 5/42 – 2025లో న్యూజిలాండ్ పై
మహ్మద్ షమీ – 5/53 – 2025లో బంగ్లాదేశ్ పై
సచిన్ టెండూల్కర్ – 4/38 – 1998లో ఆస్ట్రేలియాపై
జహీర్ ఖాన్ – 4/45 – 2002లో జింబాబ్వే పై
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాను ఎక్కువగా వన్డేలు ఆడలేదని, ఛాంపియన్స్ ట్రోఫీలో తనకి ఇదే తొలి మ్యాచ్ అని అన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలి బంతిని వేసేటప్పుడు చాలా టెన్షన్ పడినట్లు తెలిపాడు. అయితే.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లు తనకు మద్దతు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ పై విజయంతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. మార్చి4న జరగనున్న సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.