Virat Kohli : శతకాలతో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై ఒకే ఒక్కడు..
న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) చరిత్ర సృష్టించాడు
Virat Kohli creates history Most hundreds vs NZ
- ఇండోర్‌లో శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ
- వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్
- అన్ని ఫార్మాట్లలో కివీస్ పై అత్యధిక శతకాలు
Virat Kohli : ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 91 బంతుల్లోనే కోహ్లీ మూడు అంకెల స్కోరు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 54వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్నిఫార్మాట్లలలో) 85 సెంచరీ కావడం విశేషం.
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు. కాగా.. కోహ్లీ శతకంతో చెలరేగినప్పటికి భారత్ ఈ మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.
ఇదిలా ఉంటే.. కివీస్‌తో మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ పలు రికార్డులు అందుకున్నాడు. న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లను అధిగమించాడు. పాంటింగ్, సెహ్వాగ్‌లు కివీస్ పై వన్డేల్లో చెరో 6 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీ కోహ్లీకి న్యూజిలాండ్ పై ఏడోది.
వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లి (భారత్) – 36 ఇన్నింగ్స్‌లో 7 సెంచరీలు
* వీరేందర్ సెహ్వాగ్ (భారత్) – 51 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 23 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు
* సచిన్ టెండుల్కర్ (భారత్) – 42 ఇన్నింగ్స్‌లో 5 సెంచరీలు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 47 ఇన్నింగ్స్‌లో 5 సెంచరీలు
Shubman Gill : సిరీస్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్.. మా దృష్టి అంతా దానిపైనే.. అందుకే ఇలా..
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి న్యూజిలాండ్‌పై అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గానూ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. కివీస్ పై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు కలిస్ మూడు ఫార్మాట్లలో కలిపి 9 శతకాలు నమోదు చేయగా కోహ్లీ 10 శతకాలు సాధించాడు.
మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లి (భారత్) – 73 ఇన్నింగ్స్‌లో 10 సెంచరీలు
* జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 76 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు
* జో రూట్ (ఇంగ్లాండ్) – 71 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు
* సచిన్ టెండుల్కర్ (భారత్) – 80 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు
