Virat Kohli : వన్డేల్లో మైలుస్టోన్ మ్యాచ్.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్..
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

Virat Kohli on Can break 8 records in new zealand match
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయికి అడుగుదూరంలో ఉన్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ కానుంది. ఈ మైలు స్టోన్ మ్యాచ్‌లో కోహ్లీ పలు రికార్డులను అందుకునే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా..
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. 10 మ్యాచ్‌ల్లో ధావన్ 701 పరుగులు చేశాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడాడు. 651 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ 51 పరుగులు చేస్తే ధావన్‌ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
శిఖర్ ధావన్ – 10 మ్యాచ్‌ల్లో 701 పరుగులు
సౌరవ్ గంగూలీ – 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులు
విరాట్ కోహ్లీ – 15 మ్యాచ్‌ల్లో 651 పరుగులు
రాహుల్ ద్రవిడ్ – 19 మ్యాచ్‌ల్లో 627 పరుగులు
రోహిత్ శర్మ – 12 మ్యాచ్‌ల్లో 542 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..
ఓవరాల్‌గా తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు చేశాడు. కోహ్లీ కివీస్‌తో మ్యాచ్‌లో 142 పరుగులు చేస్తే గేల్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు
మహేలా జయవర్థనే (శ్రీలంక) – 22 మ్యాచ్‌ల్లో 742 పరుగులు
శిఖర్ ధావన్ (భారత్) – 10 మ్యాచ్‌ల్లో 701 పరుగులు
కుమార సంగక్కర (శ్రీలంక) – 22 మ్యాచ్‌ల్లో 683 పరుగులు
సౌరవ్ గంగూలీ (భారత్) – 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 17 మ్యాచ్‌ల్లో 653 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) – 15 మ్యాచ్‌ల్లో 651 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు..
కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక అర్థశతకాలు సాధించిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. ధావన్, సౌరవ్ గంగూలీ, కోహ్లీ, ద్రవిడ్‌లు తలా ఆరు అర్థశతకాలతో సమానంగా ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు..
సౌరవ్ గంగూలీ – 6 హాఫ్ సెంచరీలు
శిఖర్ ధావన్ – 6 హాఫ్ సెంచరీలు
రాహుల్ ద్రవిడ్ – 6 హాఫ్ సెంచరీలు
విరాట్ కోహ్లీ – 6 హాఫ్ సెంచరీలు
ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు..
ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసిసి వన్డే ఈవెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించవచ్చు. ఇప్పటి వరకు ఐసీసీ వన్డే ఈవెంట్లలో కోహ్లీ 23 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. అతను కివీస్‌తో మ్యాచ్‌లో యాభై పరుగులు సాధించగలిగితే.. ICC ఈవెంట్లలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
ALSO READ : Champions Trophy 2025 : సెమీస్ చేరిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్.. మిగిలిన జట్లకు పండగే..
ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ (భారత్) – 23 హాఫ్ సెంచరీలు
సచిన్ టెండూల్కర్ (భారత్) – 23 హాఫ్ సెంచరీలు
రోహిత్ శర్మ (భారత్) – 18 హాఫ్ సెంచరీలు
కుమార సంగక్కర (శ్రీలంక) – 17 హాఫ్ సెంచరీలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 16 హాఫ్ సెంచరీలు
కివీస్‌తో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా..
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. కివీస్ పై 42 వన్డేలు ఆడిన సచిన్ 1750 పరుగులు చేశాడు. కోహ్లీ ఇప్పటి వరకు 31 వన్డేలు కివీస్ పై ఆడాడు 1645 పరుగులు చేశాడు. ఆదివారం మ్యాచ్‌లో కోహ్లీ 106 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 51 మ్యాచ్‌ల్లో 1971 పరుగులతో కివీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
కివీస్ పై 3 వేల పరుగులు..
ఆదివారం కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ 85 పరుగులు చేస్తే న్యూజిలాండ్ పై 3వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కివీస్ పై అత్యధిక చేసిన ఆటగాడి రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 3,345 పరుగులు సాధించాడు. ఆ తరువాత వరుసగా రికీ పాంటింగ్ (3,145), జాక్వెస్ కలిస్ (3,017), జోరూట్ (3,068)లు ఉన్నాయి.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీకి మరో 150 పరుగులు అవసరం. కివీస్ పై ఈ పరుగులు సాధిస్తే కుమార సంగక్కరను కోహ్లీ అధిగమిస్తాడు. సంగక్కర 404 మ్యాచ్‌ల్లో 14,234 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 299 మ్యాచ్‌ల్లో 14085 పరుగులు సాధించాడు.
ALSO READ : IND vs NZ : వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దైతే.. పరిస్థితి ఏంటి? సెమీస్‌లో ఎవరికి లాభం ?
కివీస్ పై అత్యధిక సెంచరీలు..
ఆదివారం మ్యాచ్‌లో కోహ్లీ కివీస్ సెంచరీ చేస్తే.. న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు కోహ్లీ కివీస్ పై 31 మ్యాచ్‌ల్లో 6 శతకాలు బాదాడు. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆసీస్ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ చెరో ఆరు సెంచరీలు సాధించారు.