Champions Trophy 2025 : సెమీస్ చేరిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్.. మిగిలిన జట్లకు పండగే..
సెమీస్ చేరుకున్న ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.

Massive blow to Australia star player likely to be ruled out of Champions Trophy semifinal
కీలక ఆటగాళ్లు పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్ వంటి వారు దూరం అయినప్పటికి స్టీవ్‌స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతోంది. దానికి తోడు వరుణుడు కూడా ఆస్ట్రేలియాకు సహకరించడంతో ఈజీగా సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ ను కేటాయించారు. దీంతో ఆసీస్ 4 పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారీ తేడాతో గెలువగా దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లు వర్షం కారణం రద్దు కావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. దీంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే.. ఈ ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ సెమీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫ్గాన్ మ్యాచ్‌లో మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. దీంతో అతడు సెమీస్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. షార్ట్ గాయం తీవ్రతను ధృవీకరించాడు. స్టార్ బ్యాటర్ కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చునని చెప్పుకొచ్చాడు. దీంతో షార్ట్ కీలకమైన సెమీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి సెమీ ఫైనల్ మార్చి 4న జరగనుండగా, రెండో సెమీ ఫైనల్ మార్చి 5న జరగనుంది.
అఫ్గాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌ల్లో ఆడిన షార్ట్ 102 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 83 పరుగులు సాధించాడు. అతడి స్థానాన్ని జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ భర్తీ చేసే అవకాశం ఉంది.
అఫ్గాన్, ఆసీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. అఫ్గానిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలలో 273 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసిన స్థితిలో వర్షం పడింది. చాలా సేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గినప్పటికి అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల మ్యాచ్ ను రద్దు చేశారు.
డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతని ప్రకటించాలన్నా ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. మరో 7.1 ఓవర్ల మ్యాచ్ జరిగి ఉండే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను ప్రకటించేవారు. అయితే.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో మ్యాచ్‌ను నిర్వహించే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు.