WCL 2025 : యువీ, యూస‌ఫ్, బిన్నీ మెరుపులు.. సెమీస్‌కు భార‌త్.. పాక్‌తో ఆడేనా?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజ‌న్‌లో యువీ సార‌థ్యంలోని ఇండియా ఛాంపియ‌న్స్ సెమీస్‌కు చేరుకుంది.

WCL 2025 : యువీ, యూస‌ఫ్, బిన్నీ మెరుపులు.. సెమీస్‌కు భార‌త్.. పాక్‌తో ఆడేనా?

WCL 2025 India Champions won by 5 wickets against West Indies and enter into semis

Updated On : July 30, 2025 / 9:53 AM IST

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజ‌న్‌లో యువీ సార‌థ్యంలోని ఇండియా ఛాంపియ‌న్స్ సెమీస్‌కు చేరుకుంది. మంగ‌ళ‌వారం వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో దుమ్ములేపింది. భార‌త్ సెమీస్‌లో అడుగుపెట్టాలంటే వెస్టిండీస్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 14.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించాల్సి ఉండ‌గా.. బ్యాట‌ర్లు మెరుపులు మెరిపించ‌డంతో ల‌క్ష్యాన్ని 13.2 ఓవ‌ర్ల‌లో భార‌త్ ఛేదించి స‌గ‌ర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. కీర‌న్ పొలార్డ్ (74 నాటౌట్‌; 43 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులే చేసింది. పొలార్డ్ త‌రువాత స్మిత్ చేసిన 20 ప‌రుగులే రెండో అత్య‌ధికం కావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ఎవ్వ‌రూ రెండు అంకెల స్కోరు సాధించ‌క‌పోవ‌డంతో విండీస్ ఓ మాదిరి స్కోరుకే ప‌రిమిత‌మైంది. భారత బౌల‌ర్ల‌లో పీయూష్ చావ్లా మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ అరోన్, స్టువ‌ర్ట్ బిన్నీ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ప‌వ‌న్ నేగి ఓ వికెట్ సాధించాడు.

ENG vs IND : ఐదో టెస్టుకు ఒక రోజు ముందు భార‌త్‌కు షాక్‌.. భ‌య‌ప‌డిన‌ట్లే జ‌రిగింది..

అనంత‌రం ఓపెన‌ర్ రాబిన్ ఉత‌ప్ప (8), సురేశ్ రైనా (7), గుర్కీరత్ సింగ్ మాన్ (7) విఫ‌లమైన‌ప్ప‌టికి స్టువ‌ర్ట్ బిన్నీ (50 నాటౌట్ ; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), యువ‌రాజ్ సింగ్ (21; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), యూస‌ఫ్ ప‌ఠాన్ (21 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో 145 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 13.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. శిఖ‌ర్ ధావ‌న్ (18 బంతుల్లో 25పరుగులు) ప‌ర్వాలేద‌నిపించాడు. విండీస్ బౌల‌ర్ల‌లో స్మిత్, బ్రేవోలు చెరో రెండు వికెట్లు తీశారు.

పాక్‌తో ఆడేనా?
విండీస్ పై భారీ విజ‌యంతో నెట్‌ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర‌చుకున్న భార‌త్ నాలుగో స్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. కాగా.. సెమీస్‌లో టేబుల్ టాప‌ర్ అయిన పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్ జ‌రుగుతుందా? లేదా? అన్నది ప్ర‌స్తుతం డౌట్‌గానే ఉంది.

ENG vs IND : చివ‌రి టెస్టులో భార‌త్ గెలిచి సిరీస్‌ను స‌మం చేస్తే.. ట్రోఫీని ఎవ‌రు తీసుకుంటారు?

ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌లో లీగ్ ద‌శ‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు భార‌త ప్లేయ‌ర్లు నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌ను ర‌ద్దు చేసి ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో సెమీస్‌లో దాయాదులు త‌ల‌ప‌డ‌తాయా? లేదా అన్న‌ది చూడాల్సిందే.