Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో యశస్వి జైస్వాల్.. ఇంగ్లాండ్ పర్యటనలో.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్ చేసేనా?
ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు ఓ అరుదైన రికార్డును టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ను ఊరిస్తోంది.

Yashasvi need 202 runs in test to break sehwag dravid record
జూన్ నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్‌కు ముందు ఓ అరుదైన రికార్డు టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ను ఊరిస్తోంది.
యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు టీమ్ఇండియా తరుపున 19 టెస్టులు ఆడాడు. 52.9 సగటుతో 1798 పరుగులు చేశాడు. అతడు మరో 202 పరుగులు చేస్తే టెస్టుల్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. కాగా.. ఈ 202 పరుగులను యశస్వి మూడు ఇన్నింగ్స్‌ల్లో సాధించగలిగితే.. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొడుతాడు. ద్రవిడ్, సెహ్వాగ్‌లు ఇద్దరు చెరో 40 ఇన్నింగ్స్‌ల్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. కాగా.. యశస్వి ఇప్పటి వరకు 36 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత ఆటగాళ్లు..
రాహుల్ ద్రవిడ్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
వీరేంద్ర సెహ్వాగ్ – 40 ఇన్నింగ్స్‌ల్లో
విజయ్ హజారే – 43 ఇన్నింగ్స్‌ల్లో
గౌతమ్ గంభీర్ – 43 ఇన్నింగ్స్‌ల్లో
సునీల్ గవాస్కర్ – 44 ఇన్నింగ్స్‌ల్లో
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లు టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు లేకుండా భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఎలా ఆడనుందనే విషయం అందరిలో ఆసక్తి నెలకొంది. రెగ్యులర్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ తిరిగి తన ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగవచ్చు.
భారత జట్టు టెస్టు కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరి సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.