KGBV : తెలంగాణలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

KGBV Schools
KGBV In Telangana : తెలంగాణలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు భారీగా ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 20 కేజీబీవీలు మంజూరు అయ్యాయి. వీటిని ఏర్పాటు చేస్తూ విద్యా శాఖ జీవో నెంబర్ 24 విడుదల చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్ గా రూ.60 లక్షల నిధుల సైతం మంజూరు చేసింది.
జిల్లాల విభజనతో పాటు పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన
ప్రభుత్వం ఆయా కొత్త మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సింది. ఇలా 20 కేజీబీవీలను నెలకొల్పాల్సివుండగా వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ
బాలికా విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 2014లో తెలంగాణలో కేవలం 391 కేజీబీవీలు ఉండేవి. 2017-18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశారు.
దీంతో రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల సంఖ్య 475కి చేరింది. తాజాగా మరో 20 కేజీబీవీలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495కి చేరింది. వీటిలో 245 కేజీబీవీల్లో ఇంటర్, మరో 230 కేజీబీవీల్లో పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు.