GST Notice For Labour : ఇదేందయ్యా ఇది.. రూ.22 లక్షలు చెల్లించాలంటూ కూలీకి జీఎస్టీ నోటీసులు..

దీంతో వెంకటేశ్వర్లు విజయలక్ష్మి ఎంటర్ ప్రైజస్ ఎవరిదో కనుక్కోవడానికి విజయవాడ వెళ్లాడు.

GST Notice For Labour : ఇదేందయ్యా ఇది.. రూ.22 లక్షలు చెల్లించాలంటూ కూలీకి జీఎస్టీ నోటీసులు..

Updated On : March 14, 2025 / 7:18 PM IST

GST Notice For Labour : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామంలో సాధారణ వ్యవసాయ కూలీకి 22లక్షల రూపాయల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయ్యింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసు చూసి ఆ కూలీ బిత్తరపోయాడు. చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు కూలి పనులు చేస్తాడు. అతడికి ఈ నెల 4న జీఎస్టీ నోటీసు అందింది. తనకు చదువు రాకపోవడంతో ఆ నోటీసును తెలిసిన వారికి చూపగా.. షాకింగ్ విషయం బయటపడింది.

విజయవాడ బెంజ్ సెంటర్ లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చినట్లు చెప్పారు. విజయలక్ష్మి ఎంటర్ ప్రైజస్ పేరుతో కోటి రూపాయల విలువైన గ్రానైట్ బిజినెస్ చేశారని, 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి మొత్తం జీఎస్టీ 22 లక్షల 86వేల 14 రూపాయలు బకాయిపడ్డట్లు నోటీసులో పేర్కొన్నారు.

దీంతో వెంకటేశ్వర్లు విజయలక్ష్మి ఎంటర్ ప్రైజస్ ఎవరిదో కనుక్కోవడానికి ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అయితే, ఆ అడ్రస్ లో అసలు కార్యాలయమే లేదని తేలడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. 2022లో అతడికి పాన్ కార్డ్ కూడా లేదు. 6 నెలల క్రితమే చండ్రుగొండలోని మీ-సేవ కేంద్రానికి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి వెళ్తే.. ఆ పేరు, ఆధార్ నెంబర్ తో అప్పటికే పాన్ కార్డ్ జారీ అయ్యిందని చెప్పారు.

Also Read : 53 కిలోల బంగారం తుప్పుపట్టిపోతుంది.. తిరిగి అప్పగించండి.. గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!

అయితే, వెంకటేశ్వర్లు ఆధార్ కార్డ్ అక్రమార్కుల చేతికి ఎలా వెళ్లింది? ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకుంది ఎవరు? అనేది తేలాల్సి ఉంది. రెక్కాడితే కాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని బాధితుడు వాపోయాడు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.