ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, 16నుంచి కేసు ట్రయల్స్

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 06:27 AM IST
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, 16నుంచి కేసు ట్రయల్స్

Updated On : November 12, 2020 / 7:19 AM IST

vote for note case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 16న ఓటుకు నోటు కేసు ట్రయల్స్‌ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఇదే క్రమంలో అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలని నిందితులు సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా కోర్టును కోరారు. డిశ్చార్జ్ పిటిషన్లపై తాము హైకోర్టును ఆశ్రయించినందున అదనపు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇందుకు ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జి పిటిషన్లపై అప్పీల్ పేరుతో వారికి గడువు ఇవ్వొద్దని అధికారులు కోర్టుకు విన్నవించారు.



మహానాడు వేదికగా కుట్ర : –
గతంలో డిశ్చార్జ్ పిటిషన్స్ విచారణ తరుణంలో నిందితులపై అభియోగాలకు తగ్గ ఆధారాలు తమవద్ద ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఓటుకు నోటు కేసు ఒక కుట్ర పూరితంగా జరిగిందని.. గండిపేట తెలుగుదేశం మహానాడు వేదికగా కుట్ర జరిగిందని తెలిపింది. నోవెటెల్ హోటల్‌లో రేవంత్, సండ్రా, ఉదయసింహ సంప్రదింపులు జరిపారని.. వేం నరేందర్ రెడ్డి గెలుపు కోసం జరిపిన కుట్రగా పేర్కొంది. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు జరిగిన బేరసారాల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏసీబీ వివరించింది.



స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు: –
స్టీఫెన్ సన్‌కు ఇచ్చేందుకు 50 లక్షలు రూపాయలను నాగోల్ వద్దకు వచ్చి తీసుకోవాలని ఉదయసింహను రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత స్టీఫెన్ సన్ నివాసంలో ఏసీబీ స్ట్రింగ్ ఆపరేషన్‌లో రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని వివరించింది.
ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో స్టీఫెన్.. రేవంత్ రెడ్డి ఫోన్ సంప్రదింపుల ఆడియో టేపులు సంచలనం కలిగించాయి. అయితే ఓటుకు నోటు కేసులో ఇప్పుడు అవే కీలకంగా మారాయి.



ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం : –
ఆడియో టేపుల అంశంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక మరింత కీలకం కానుందని భావిస్తున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం ఈ కేసులో ఈ నెల 16 నుంచి అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మరోవైపు నాలుగు రోజుల్లో కోర్టు ట్రయల్స్ ప్రారంభమవుతుండడంతో.. ఈ కేసులో సూత్రదారులు, పాత్రదారుల్లో టెన్షన్ మొదలైంది.