సహకరించే నాయకులు లేక అయోమయంలో ఆత్రం సక్కు.. సోలోగా ఎన్నికల ప్రచారం

ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు గట్టి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ.. బరువు బాధ్యతలు తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తుంది.

సహకరించే నాయకులు లేక అయోమయంలో ఆత్రం సక్కు.. సోలోగా ఎన్నికల ప్రచారం

Athram Sakku: ఓవైపు వరుసగా పార్టీని వీడుతున్న నేతలు.. మరోవైపు నేతల సహాయ నిరాకరణ.. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు తలనొప్పిగా మారింది. ఏం చేయాలో తోచక.. ఒక్కడే ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కీలక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పెద్దఎత్తున లీడ్ ఇచ్చిన సిర్పూర్ నియోజకవర్గం ముఖ్యనేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీని వీడారు. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు ఎన్నికల ప్రచారంపై ప్రభావం కనిపిస్తుంది. సక్కు తరఫున ప్రచారం చేసేందుకు నాయకులే కరువయ్యారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. బీఆర్ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్ తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్ కొంత బాధ్యత తీసుకొని సక్కుతో కలసి నడుస్తున్నారు.

ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం పట్టు బిగించే దిశగా చర్యలు చేపట్టింది.. ఆత్రం సక్కుకి మద్దతుగా పార్లమెంటు పరిధిలో మాజీ సీఎం కేసిఆర్‌తో మూడుచోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో రోడ్ షోలు, సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య?

ఇక బీఆర్ఎస్‌లో ఉన్న అగ్రనేతలతో సైతం ప్రచారాన్ని హోరెత్తించాలని చూస్తున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఎలా.. ఎవరు ముందుండి నడిపిస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు గట్టి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ.. బరువు బాధ్యతలు తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తుంది. దీంతో ఎన్నికలను ఎదుర్కోవడం ఆత్రం సక్కుకు సవాల్‌గా మారింది.