Malakpet Infants Death : మలక్ పేట ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ఫెక్షనే కారణం
హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ఫెక్షన్ కారణమని విచారణలో తేలింది. అదే రోజు మరో 18 మందికి సర్జరీలు చేయగా అందరిలోనూ ఒకటే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు.

infants death
Malakpet Infants Death : హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ఫెక్షన్ కారణమని విచారణలో తేలింది. ఇన్ఫెక్షన్ కారణంగానే ఇద్దరు బాలింతల మృతి చెందారని ఎంక్వైరీ కమిటీ నిర్ధారించింది. అదే రోజు మరో 18 మందికి సర్జరీలు చేయగా అందరిలోనూ ఒకటే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సర్జరీ చేసిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి అందజేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్.. సర్కార్ నుంచి ఆదేశాల కోసం వేచిచూస్తోంది. 18 మంది బాలింతలను చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఇందులో ఇద్దరికి కిడ్నీలపై ప్రభావం పడింది. నిన్న ముగ్గురు బాలింతలను డిశ్చార్జ్ చేశారు. ఒకే రకమైన బ్యాక్టీరియా వల్ల బాలింతలు మృతి చెండటం పట్ల ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Two Infants Dead : హైదరాబాద్ లో ఇద్దరు బాలింతలు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
మరోవైపు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు. ముందస్తు పరీక్షలు చేయకుండా ఆపరేషన్ చేయడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెంగీ ఫీవర్ తో సిరివెన్నెల అనే బాలింత ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి.
మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో బాలింత సిరివెన్నల మృతి చెందారు. ఇక మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 10న బిడ్డకు జన్మనిచ్చిన శివాని అనే మరో బాలింత బీపీ, షుగర్ తగ్గిపోవడంతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. దీంతో శిశువులతో ఇద్దరు బాలింతల మృతుల కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. చాదర్ ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.