Kavitha: కవిత రాజీనామాకు ఆమోదం.. తెలంగాణలో మరో ఉపఎన్నిక ఖాయం..?
ఇప్పుడు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Kavitha
- ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయాలు
- కవిత రాజీనామాతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక?
- ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది
Kavitha: ఉత్కంఠకు తెరపడింది. జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గతేడాది సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.
2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉంది. నాడు కాంగ్రెస్ పోటీ చేయలేదు, బీజేపీ కూడా అభ్యర్థిని నిలపలేకపోయింది. ఆ పరిస్థితుల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కవిత పదవీ కాలం ఉంది. అయితే రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆమె రిజైన్ చేసేశారు.
ఇప్పుడు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. కవిత రాజీనామాకు ఆమోదం లభించడంతో కౌన్సిల్‌లో ఓ స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్‌కు చైర్మన్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. దీంతో ఆ స్థానం భర్తీ కోసం కొన్ని రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాకే బైపోల్..
కవిత రిజైన్ తో ఉపఎన్నిక అనివార్యమే అయినా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాకే బైపోల్ జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఓటు వేయాలంటే మొదట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓటర్లు లేరు. దీనివల్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడే నిర్వహించడం సాధ్యం కాదు. మున్సిపల్ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి.. పరిషత్ ఎన్నికలు ముగిశాకే… పాలక మండళ్లు కొలువుదీరిన తర్వాతే ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కనీసం మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కవిత.. తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది.
డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో మిగతా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Also Read: దూకుడు పెంచిన కవిత.. ఇప్పుడు పెద్ద సార్‌పైనే అటాక్.. అయినా వై దిస్ సైలెన్స్?
