తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలో ‘సమైక్య’ ప్రశ్నలు.. ఏపీ వ్యాపారుల ప్రస్తావన దేనికి సంకేతం?

తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు ఆడగాల్సింది పోయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన గురించి ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలో ‘సమైక్య’ ప్రశ్నలు.. ఏపీ వ్యాపారుల ప్రస్తావన దేనికి సంకేతం?

Updated On : December 17, 2024 / 9:29 PM IST

ఇవి తెలంగాణ గ్రూప్-2 పరీక్షలా.. ఏపీకి చెందిన ప్రశ్నాపత్రమా.. తెలంగాణ గ్రూప్-2 ప్రశ్నల్లో సమైఖ్య రాగాలు వినిపించాయా.. ఉద్యమ చరిత్ర ఊసే లేదా.. ప్రశ్నలనే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. అసలు గ్రూప్ -2 పరీక్షల్లో వివాదానికి దారితీసిన ప్రశ్నలేంటి? రాద్ధాంతానికి దారితీసిన ప్రశ్నలను ఎందుకు అడగాల్సి వచ్చింది. తెలంగాణ వాదాలను నొప్పించడానికా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేతలను మెప్పించడానికా..

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్‌-2020 డాక్యుమెంట్‌ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది..? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావుల కంపెనీలు ఏమిటో గుర్తించండి..? ఈ ప్రశ్నలను చూసి ఇవేవో ఏపీపీఎస్పీకి చెందిన ప్రశ్నవాళి అనుకుంటున్నారా.. కానే కాదు. తెలంగాణ గ్రూప్‌-2 ప్రశ్నపత్రంలో అక్షరసత్యంగా కనిపించిన ప్రశ్నలివి. క్వశ్చన్‌ పేపర్‌ను చదవిన అభ్యర్థులు అసలు ఇదే టీజీపీఎస్సీ ఇచ్చిన పేపరేనా సందేహపడిన సందర్భమది.

ఎన్టీఆర్‌ పాలన వంటి అంశాలు ఎందుకు?
తెలంగాణ గ్రూప్-2 ప్రశ్నపత్రంలో సమైక్య పాలకుల ప్రస్తావన ఎందుకు.. ఎన్టీఆర్‌ పాలన వంటి అంశాలపై అడిగాల్సిన అవసరమేంటి? ఇప్పుడేవి ప్రశ్నలు టీజీపీఎస్పీని సంధిస్తుంది తెలంగాణ సమాజం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదిలాబాద్‌ జిల్లాను దత్తతకు తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు.. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి సుమారు 190 టీఎంసీల నీటిని ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశారు’ అని ప్రశ్నలను ఇచ్చి ఇందులో ఏవి సరైనవో గుర్తించండని అడిగారు.

ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణవాదులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పైగా ఎన్టీఆర్‌ హయాంలోని పలు విషయాలపై ప్రశ్నలను ప్రస్తావించారు. 1983 ఎన్నికల్లో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీఆర్‌ ప్రచారం చేసిన విధానాలపై ప్రశ్నలు వచ్చాయి.

ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రుల విగ్రహాల ఏర్పాటు, ఎన్టీఆర్‌ తెలంగాణ సమాజ, సాంస్కృతిక పునాదులపై దాడి అనే అంశాలపై ప్రశ్నలను సంధించారు. మరోవైపు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? అంటూ మరో ప్రశ్న. ఇలా ప్రతి ప్రశ్నలో సమైక్య పాలకులను గుర్తు చేసేలా పేపర్‌ను రెడీ చేశారని టీజీపీఎస్సీ అపవాదును మూటగట్టుకుంది.

ఆ పరీక్ష ఏపీపీఎస్సీ కోసమా ఏంటి?
గ్రూప్‌-2 పరీక్షల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూస్తుంటే.. ఆ పరీక్ష ఏపీపీఎస్సీ కోసమా? అన్న అనుమానం కలుగుతోందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ఉద్యమచరిత్ర స్థానంలో సమైక్యపాలకుల చరిత్రను చేర్చడమేంటనే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న మార్పు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు ఆడగాల్సింది పోయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన గురించి ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి.. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. ఇప్పుడు ఆయన హయాంలో జరిగిన పరీక్షలో టీడీపీ పాలనకు సంబంధించి, ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలపై ప్రశ్నలు రావడంతో ఎవరిని మెప్పించడానికి అంటూ తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. మరి ఈ ప్రశ్నల వివాదంపై టీజీపీఎస్పీ స్పందిస్తుందా.. సర్కారే సమాధానం చెబుతుందా.. చూడాలి.

కడప కార్పొరేషన్‌పై టీడీపీ గురి పెట్టిందా? జగన్‌ అడ్డాలో ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?