Revanth Reddy : హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే- రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KCR : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేది.

Revanth Reddy : హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే- రేవంత్ రెడ్డి

Revanth Reddy Anumula (Photo : Google)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రచార జోరుని పెంచాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తోంది. కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోతుంటే.. కేసీఆర్ టార్గెట్ గా హస్తం పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కుత్బుల్లాపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని రేవంత్ రెడ్డి అన్నారు.

‘నన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలది. నేనీ స్థాయికి చేరడంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఉంది. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో నాగార్జున సాగర్, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్.. ఈ సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లే. చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందే. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్.

Also Read : 420 మ్యానిఫెస్టో, మాది కాపీ కొట్టారు- కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్

బెంగాలీలు, ఒడిశా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉపాధి కలుగుతుందంటే అది కాంగ్రెస్ కృషి వల్లే. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప మోదీ, కేసీఆర్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునే వారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారు.

కేసీఆర్ పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 83వేల మంది రైతులు చనిపోయారు. కేసీఆర్ లోపభూయిష్ట విధానాలతో అవినీతి పెరిగింది. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగింది. మేడిగడ్డ.. కేసీఆర్ అవినీతికి, దోపిడీకి బలైంది. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయింది.

Also Read : ఓడితే కేసీఆర్‌ను కేటీఆర్ వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు : బండి సంజయ్

నిన్న కర్ణాటక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. నేడు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుంది. 2024లో ఖర్గే నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. ఈ ఎన్నికలు కేసీఆర్ ను ఉంచాలా.. కేసీఆర్ ను దించాలా అని జరుగుతున్న ఎన్నికలు. బరాబర్ కేసీఆర్ ను దించుడే.. దంచుడే అని ప్రజలు అంటున్నారు. కుత్బుల్లాపూర్ లో కొలను హన్మంత రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.