ఖమ్మం సీటు విషయంలో పట్టువీడని పొంగులేటి, భట్టి.. డీకే వద్దకు పంచాయితీ..!

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది.

ఖమ్మం సీటు విషయంలో పట్టువీడని పొంగులేటి, భట్టి.. డీకే వద్దకు పంచాయితీ..!

Khammam Lok Sabha constituency

Telangana Congress Party : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆయా పార్టీల నుంచి బీఫాంలు అందుకున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరో మూడు రోజుల వరకే నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. అయితే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు తమతమ వ్యూహలను అమలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అధిష్టానాలు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ 14నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఇప్పటికే అధిష్టానం ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది.

Also Raed : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్యేకు షాకిచ్చిన కార్పొరేటర్లు

ఖమ్మం పార్లమెంట్ సీటుకోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య పోటీ నెలకొంది. ఖమ్మం టికెట్ తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుపడుతుండగా.. భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరుతున్నారు. ఒకవేళ తన భార్య నందినికి టికెట్ ఇవ్వని పక్షంలో కమ్మ సామాజిక వర్గంకు చెందిన రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం పెద్దలకు సూచించారు. పొంగులేటి, భట్టి ఇద్దరు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునే క్రమంలో పట్టువీడకుండా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీరి పంచాయితీ బెంగళూరుకు చేరింది.

Also Read : AP SSC Result 2024 : ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బెంగళూరుకు పిలిపించుకొని మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. దీంతో ఇవాళ సాయంత్రం లేదా మంగళవారం ఉదయంకు ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలిచే వ్యక్తి ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది. ఈనెల 25వ తేదీ వరకే నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు సమయం ఉండటంతో దాదాపు సోమవారం సాయంత్రం వరకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే, భట్టి, పొంగులేటి సూచించిన పేర్లలో ఎవరికి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేస్తుందన్న విషయంపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.