Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు..
క్వారీ యజమానిని బెదిరించారన్న కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Kaushik Reddy Arrest
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. కాజీపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్వారీ యజమానిని బెదిరించారన్న కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
అంతకుముందు కాజీపేట రైల్వే కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. 41 సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వకుండా, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చట్టవ్యతిరేకమని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, తాము చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కాజీపేట రైల్వే థర్డ్ ఎంఎం (మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్) కోర్ట్ ఇంఛార్జ్ జడ్జి తీర్పు ఇచ్చారు.
బెదిరింపులు, డబ్బు వసూలు ఆరోపణలపై హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న అర్థరాత్రి దాటాక ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు హైడ్రామా నడిచింది. ఈ ఉదయం నుంచి అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనపై అక్రమ కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
Also Read: హైదరాబాద్ లో రూ.500 కోట్ల స్కాం.. మొత్తం సాగిందిలా.. బయటపడిందిలా..