హైదరాబాద్ లో రూ.500 కోట్ల స్కాం.. మొత్తం సాగిందిలా.. బయటపడిందిలా..
మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.

AV Infra Fraud: హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రెండింతలు డబ్బులు ఇస్తామంటూ మోసానికి పాల్పడింది ఏవీ ఇన్ ఫ్రా సంస్థ. యాదగిరిగుట్ట, నారాయణఖేడ్, బుదేరాలో వెంచర్లు ఉన్నాయని, ఇందులో పెట్టుబడులు పెడితే రెండింతలు డబ్బులు ఇస్తామంటూ నమ్మించి నట్టేట ముంచారు.
ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిస్తామంటూ చివరికి కుచ్చుటోపీ పెట్టారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏవీ ఇన్ ఫ్రా సంస్థ ఛైర్మన్ విజయ్ గోగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ ఫ్రా సంస్థ ఏకంగా రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని ఊరించింది. ఒక వేళ డబ్బులు ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చింది. 18 నెలలకు 50 శాతం అదనంగా ఇస్తానని డబ్బులు వసూలు చేసింది. ఈ ప్రకటనలు చూసి ఆశపడ్డ బాధితులు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అలా 500 కోట్లు వసూలు అయ్యాయి. ఆ తర్వాత ఏవీ ఇన్ ఫ్రా సంస్థ చైర్మన్ తన అసలు రూపం బయటపెట్టాడు. అందరినీ నట్టేట ముంచేశాడు. రెండింతల డబ్బులు ఇచ్చే మాట అటుంచితే.. కనీసం కట్టిన డబ్బు కూడా వెనక్కి ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు.
”పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ డబ్బు ఇవ్వలేకపోతే భూమి ఇస్తామని, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు 18 నెలలకు 50 శాతం అదనంగా ఇస్తానని డబ్బు వసూలు చేశారు. కొన్నాళ్లకు మా డబ్బు గురించి అడిగితే మరో చోట ప్రాజెక్ట్ అంటూ మాట మార్చారు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో వెంచర్లు ఉన్నాయని నమ్మించారు. చివరికి మేము మోసపోయామని తెలుసుకున్నాం” అని బాధితులు వాపోయారు.
”ఏవీ ఇన్ ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేశాం. ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ అని, బై బ్యాక్ ఆఫర్ అని, ప్రీ లాంచ్ అని కొన్ని స్కీమ్ లు పెట్టారు. ఏడాదిలో మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తామని నమ్మించారు. 50శాతం అదనపు మొత్తంతో డబ్బుని రిటర్న్ చేస్తామన్నారు. వారి మాటలు నమ్మాము. కొందరు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. కొందరు కోటి రూపాయలు కూడా పెట్టుబడిగా పెట్టారు.
చివరికి మోసం చేశారు. మా డబ్బు మాకు వెనక్కి ఇవ్వలేదు, భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇలా వెయ్యి మంది వరకు బాధితులు ఉన్నారు. ఇది చాలా పెద్ద స్కామ్. 10 లక్షలు పెట్టుబడిగా పెట్టిన వారిలో కొందరు రూ.15లక్షలు ఇచ్చారు. దీంతో ఇది నిజమైన సంస్థ అని కొందరు నమ్మేశారు. పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. అలా వందల కోట్లు డబ్బులు వసూలు చేశాడు.
పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాక.. ఏవీ ఇన్ ఫ్రా సంస్థ ఛైర్మన్ తన నిజ స్వరూపం బయటపెట్టాడు. మా డబ్బులు మాకు ఇవ్వడం మానేశాడు. మీ పేరుతో భూమి రిజిస్ట్రేషన్ చేశాము, కానీ ఇప్పుడు మార్కెట్ లేదు, మీ డబ్బు మీకు ఇవ్వలేము అని కబుర్లు చెప్పాడు. చివరికి సంస్థ ఛైర్మన్ అడ్రస్ లేకుండా పోయాడు. పోలీసులు మాకు న్యాయం చేయాలి, మా డబ్బు మాకు ఇప్పించేలా చూడాలి” అని బాధితులు వాపోయారు.