Bandi Sanjay : సోనియా గాంధీ మహిళే అయినా.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?- బండి సంజయ్

యూపీఏ ఛైర్ పర్సన్ గా పదేళ్ల పాటు పని చేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ, పార్లమెంటులో యూపీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ.. Bandi Sanjay - Sonia Gandhi

Bandi Sanjay : సోనియా గాంధీ మహిళే అయినా.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?- బండి సంజయ్

Bandi Sanjay - Sonia Gandhi (Photo : Google)

Updated On : September 19, 2023 / 11:02 PM IST

Bandi Sanjay – Sonia Gandhi : మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారాయన. మహిళా బిల్లు విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపైన ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనా నిప్పులు చెరిగారు బండి సంజయ్. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్, సోనియా గాంధీ వైఖరిపై ధ్వజమెత్తారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అంటూ విరుచుకుపడ్డారాయన.

”మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు ఐదు దశాబ్దాల నాటిది. 1975లోనే లోక్ సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం దురదృష్టకరం.

Also Read..Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లకే ఇన్నేళ్లు పడితే.. అధికారం రావడానికి ఎన్నేళ్లు పడుతుందో?

అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 జూలైలో తొలిసారిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదు. ఆ తర్వాత వాజ్ పేయి ప్రభుత్వం మరో మూడు సార్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్, మిత్రపక్షాలు చేసిన కుట్రల వల్ల ఆమోదానికి నోచుకోలేకపోయింది. యూపీఏ ఛైర్ పర్సన్ గా పదేళ్ల పాటు పని చేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ, పార్లమెంటులో యూపీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఆమోదించలేకపోయారంటే కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి పార్లమెంటులో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నందున మహిళా బిల్లు ఆమోదం పొందడం ఖాయం. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకించినా బిల్లును అడ్డుకోవడం అసాధ్యం. మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ మహిళా ద్రోహి పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ విధానాలను మానుకోవాలి. అంతకంటే ముందే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి” అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Also Read..Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మార్చడంలో 27 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తి చరిత్ర తెలుసుకోండి