MP Bandi Sanjay: గవర్నర్‌ను చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నడు.. నేనెక్కడ పోటీచేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది

బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపుతున్నారని, ఏ పార్టీ నాయకులు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భావిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు.

MP Bandi Sanjay: గవర్నర్‌ను చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నడు.. నేనెక్కడ పోటీచేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది

MP Bandi Sanjay

Updated On : August 26, 2023 / 1:08 PM IST

BJP MP Bandi Sanjay: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంకోసం మరోసారి అనేక కుట్రలకు సీఎం కేసీఆర్ తెరతీశారని బీజేపీ ఎంపి బండి సంజయ్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపుతున్నారని, ఏ పార్టీ నాయకులు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భావిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులారా.. కేసీఆర్ కుట్రలు తెలుసుకోండి అంటూ సంజయ్ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల సమస్యల పరిష్కారంకోసం కాకుండా నియంతలా పాలిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ రాక్షస పాలన అంతమే మా లక్ష్యం అని సంజయ్ అన్నారు.

Bandi Sanjay Fires on CM KCR : నటనలో కేసీఆర్‎ను మించిన వారు లేరంటూ మండిపడ్డ బండి సంజయ్

ఎన్నికల సమీపిస్తున్న సమయంలో సీఎం అభ్యర్ధి తానేనని చెప్పుకునే వాళ్లు మూర్ఖులేనని సంజయ్ అన్నారు. సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చిలను ప్రారంభం సందర్భంగా తమిళిసై సౌందరరాజన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంపై బండి సంజయ్ స్పందించారు. గవర్నర్‌ను చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నాడని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ సహా తెలంగాణకు పెద్ద ఎత్తున కేంద్రమే నిధులిస్తోందని, అయినా బీజేపీ ఏమీ చేయడం లేదంటూ కేసీఆర్ కుటుంబం దుష్ప్రచారం చేస్తుందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనెక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని, పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం అని బండి సంజయ్ చెప్పారు.

Bandi Sanjay : భక్తులు తిరుమలకు రాకుండా చేస్తున్నారు, వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవు- బండి సంజయ్ సీరియస్ వార్నింగ్

ఎంఐఎం ఉన్నంత కాలం బీజేపీ జెండా ఎగరదని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడని, ఎంఐఎం పార్టీ కేవలం ఓల్డ్ సిటీలోని ఏడు సీట్లకే పరిమితం అని అన్నారు. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ ద్వారా ముస్లీం సమాజానికి ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఓట్లను చీల్చి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మేలు చేయాలని ఎంఐఎం పార్టీ చూస్తుందని, ఎంఐఎం పార్టీకి దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ అన్నారు.