ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను కలిసిన భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

MLC Kavitha: కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశారు కేటీఆర్.

ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను కలిసిన భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

KTR

ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవిత యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయపోరాటం చేద్దామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు.

కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఏడు రోజులు కస్టడీకి అనుమతిస్తూ నిన్న తీర్పు ఇచ్చింది. లిక్కర్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో కవిత పాత్ర ఉందని కోర్టుకు ఈడీ చెప్పింది.

అమెరికాలో ఉద్యోగం నుంచి లిక్కర్ స్కామ్ వరకు..
తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప్రజా జీవితంలోకి వచ్చిన కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. తెలంగాణ జాగృతి, బతుకమ్మతో తెలంగాణ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎంపీగా.. ఎమ్మెల్సీగా పదవులు చేపట్టిన ఆమె రాజకీయంగా ఎత్తు, పల్లాలను ఎదుర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, శోభ దంపతులకు 1978 మార్చి 13న జన్మించిన కవిత…. విద్యాభ్యాసం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ VNR విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బీ.టెక్ పూర్తి చేశారు.

ఉన్నత విద్య కోసం అమెరికాలోని మిసిసిపి విశ్వవిద్యాలయంలో చేరి మాస్టర్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కేసీఆర్‌ రాజకీయాలను చిన్ననాటి నుంచి పరిశీలించిన కవిత…. తండ్రి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంతో భాగస్వామి కావాలని.. అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రాష్ట్రానికి చేరుకున్నారు.

రాష్ట్ర సాధన కోసం ఒక వైపు గులాబీ బాస్ కేసీఆర్‌ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే…. కవిత తన సొంత ఆలోచనలతో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించారు.

ఓవైపు పార్టీ ఇస్తున్న కార్యక్రమాలు మరోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. జాగృతి చేపట్టిన వివిధ కార్యక్రమాలతో మహిళలు, యువతకు ఆమె మరింత చేరువయ్యారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లో కూడా బతుకమ్మ పండుగ నిర్వహించి అంతర్జాతీయంగా తెలంగాణ పండుగల విశిష్టతను తెలియజేశారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన కవిత 2014 ఎన్నికల్లో ఆమె స్వగ్రామం నిజామాబాద్ నియోజకవర్గంలో ఉండటంతో…. ఆ స్థానం ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోటీ చేసిన తొలిసారి ఎంపీగా విజయం సాధించిన ఆమె రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యారు.

పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్న సింగరేణి ప్రాంతంలో కీలకంగా ఉండే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘానికి, తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్‌కు గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు. అలాగే.. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ తొలి రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కమిషనర్‌గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఈ పదవిని అలంకరించారు.

భారత జాగృతి సంస్థగా..
ఎంపీగా పార్లమెంట్‌లో, ప్రజా జీవితంలో తెలంగాణతో పాటు ఇతర జాతీయ సమస్యలపై కవిత ఉద్యమించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసి కవిత ఓడిపోయారు. అయినా రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉండటంతో….. ఎన్నో జాతీయ అంశాలపై కవిత జాగృతి ఆధ్వర్యంలోనే వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవడంతో తెలంగాణ జాగృతి సంస్థను కూడా భారత జాగృతి సంస్థగా కవిత పేరు మార్చారు.

మహిళా సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో ఆందోళనలు చేశారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత.. ఎలాంటి పదవులు లేకుండా ఉన్న ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల మండలికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా కవిత ప్రజా సమస్యలపై గళం వినిపించారు.

Kishan Reddy : అప్పటివరకు వెంటాడతాం- కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి వార్నింగ్