Harish Rao: భయపడేది లేదు.. హైకోర్టు తీర్పు తరువాత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..

BRS Leader Harish Rao: ఫార్ములా ఈ-కారు రేసు కేసు (Formula E Car Race Case) లో ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. తాజా పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. ఈ కేసులో తప్పు జరిగిందని చెప్పి కోర్టు శిక్ష ఏమీ వేయలేదు. విచారణ జరుపుకోవచ్చని మాత్రమే హైకోర్టు చెప్పింది. కానీ, కాంగ్రెస్ నాయకులు కొందరు సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తరువాత తదుపరి కార్యాచరణపై న్యాయవాదులతో చర్చించామని హరీశ్ రావు తెలిపారు.
Also Read: Formula E race case: కేటీఆర్‌కు జైలు తప్పదా?.. క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న హరీశ్.. కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తోందని అన్నారు. ఇంకా మా పార్టీ నేతలపై రేవంత్ రెడ్డి కేసులు పెడతారు. ఎందుకంటే.. ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అదేక్రమంలో రైతు భరోసాను రూ.15వేల నుంచి రూ. 12వేలకు తగ్గించారు. రైతు భరోసా తగ్గింపు నుంచి, ఏడాది పాలన ఫెయిల్యూర్ నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాద్దాంతం చేస్తుందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. కేటీఆర్ కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకు వస్తారని హరీశ్ రావు అన్నారు.
Also Read: Venkat Balmoor: జైల్లో యోగా చేస్తా అన్నావ్ కదా.. ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు? : బల్మూరి వెంకట్
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రంకు జరిగిన నష్టం ఏమీ లేదు. కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టే ఏసీబీ విచారణకు వచ్చారు. 9వ తేదీన ఏసీబీ విచారణకు వెళ్తారు. అన్ని రకాలుగా సహకరిస్తాం. తరువాత పరిణామాలపై మా లీగల్ టీం సూచనల మేరకు ముందుకెళ్తామని హరీశ్ చెప్పారు.
ఏసీబీ అధికారులు ఇవాళ సాయంత్రమే కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉంటుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇదేం మాకు కొత్త కాదు.. తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు మేము అరెస్టై జైళ్లకు వెళ్లాం. కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యి వరంగల్ జైలుకెళ్లారు, మా నాయకులందరూ అరెస్టై జైళ్లకు వెళ్లారు.. చివరికి ఏం జరిగిందంటే రాష్ట్రం వచ్చింది. అక్రమ అరెస్టు చేస్తే చేయనివ్వండి.. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది.. దానికి మేము భయపడం, తప్పకుండా లీగల్ గా రేవంత్ సర్కార్ పై పోరాటం చేస్తామని హరీశ్ రావు అన్నారు.