Harish Rao Thanneeru : పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లే, మూడోసారి కూడా సీఎం ఆయనే- మంత్రి హరీశ్ రావు
గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల పరిస్థితి మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే ప్రజల పరిస్థితి మారింది. Harish Rao Thanneeru

Harish Rao Thanneeru BRS (Photo : Facebook)
Harish Rao Thanneeru – BRS : నిజామాబాద్ జిల్లా దర్పల్లి సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మతిరుగుతుందన్నారు. ఎవరెన్నికుట్రలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అని హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడవసారి కేసీఆర్ యే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
కేసీఆర్ కి ఉన్న అవగాహన నరేంద్ర మోదీకి లేదు..
”కేసీఆర్ అంటే ఒక నమ్మకం. ప్రజల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న అవగాహన నరేంద్ర మోదీకి లేదు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు కేసీఆర్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ముందుకెళ్లి ఢిల్లీని కదిలించి రాష్ట్రం సాధించి మాట నిలుపుకున్న నాయకుడు కేసీఆర్.
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..
అబద్దాల కాంగ్రెస్ ను నమ్మితే ఆగం అయిపోతాం. కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్లీ వెనకబడుతుంది. దర్పల్లి అంటేనే ఉద్యమాల గడ్డ. ఇలాంటి గడ్డపై 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవటం సంతోషం. 33కోట్ల నిధులతో చేపట్టే ఈ ఆసుపత్రి సత్వరం పూర్తి చేయిస్తాం. మారుమూల ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం.(Harish Rao Thanneeru)
Also Read..Palakurthy: పాలకుర్తిలో రేవంత్‌రెడ్డి కొత్త ప్రయోగం.. ఈసారి జెండా పాతేదెవరు?
ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడే పరిస్థితి వచ్చింది..
కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందేది. కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు భరోసా దొరికింది. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో మెరుగయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రుల్లో ప్రజల ప్రాణాలకు భద్రత ఉండేది కాదు. ఆరోజు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే ఈరోజు పోదాం పద బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారు.
నాడు 2వేలే, నేడు 10వేల మెడికల్ కాలేజీలు..
తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 2వేల 850 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు 10వేలు ఉన్నాయి. మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గతంలో తాగునీటికి ఎంతో కటకట ఉండేది. ఈరోజు ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు అందుతోంది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల పరిస్థితి మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే ప్రజల పరిస్థితి మారింది. మన పక్కనే ఉన్న రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి లాంటి మానవీయ పథకాలు ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలి.
మహిళల కోసం ఎన్నో పథకాలు..
మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు చేపట్టారు. 74 మహిళా రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. బీడీలు చుట్టే మహిళల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారా?(Harish Rao Thanneeru)
రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే నాయకుడు కేసీఆర్..
ఇలాంటి కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలి. ఎన్నికలు రాగానే సంక్రాంతి గంగిరి ఎద్దుల్లా ఇతర పార్టీల నేతలు ఊర్లకు వస్తారు. ఇచ్చిన ప్రతి హామీ, ఇవ్వని హామీలను కూడా చేసి చూపించాము. ఒకప్పుడు కూలి పని దొరకని తెలంగాణలో ఇప్పుడు కూలీలు దొరకని పరిస్థితి. సీఎం కేసీఆర్ కృషి పట్టుదల వల్లనే ఈ ప్రగతి సాధ్యమైంది. రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడే బాజిరెడ్డి గోవర్ధన్. నిత్యం ప్రజాసేవలో ఉండే బాజిరెడ్డిని మళ్లీ గెలిపించాలని” విజ్ఞప్తి చేశారు హరీశ్ రావు.