ఇంట్లో కూర్చుని సేవ చేస్తామంటే ఎలా? ఐఏఎస్ అధికారులపై క్యాట్ సీరియస్..
డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులు కోరారు.

CAT Serious On IAS Officers (Photo Credit : Google)
CAT : ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటూ డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు వేసిన పిటిషన్ పై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) కీలక తీర్పునిచ్చింది. డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు పాటించాల్సిందేనని ఆదేశాలిచ్చింది. ఏపీకి వెళ్లాల్సిందేని స్పష్టం చేసింది. రేపు(అక్టోబర్ 16) యధావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలంది. దీంతో ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.
పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ లపై క్యాట్ ప్రశ్నల వర్షం కురిపించింది. వన్ మెన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారని క్వశ్చన్ చేసింది. ఏపీలోని విజయవాడలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి చోటుకు వెళ్లి ప్రజలకు సేవ చేయాలని లేదా అని అడిగింది. బోర్డర్ లో సమస్యలు వస్తే వెళ్లరా అని ప్రశ్నించిన క్యాట్.. ఇంట్లోనే కూర్చుని సేవ చేస్తామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు క్యాట్ ఎదుట ఐఏఎస్ కౌన్సిల్ వాదనలు వినిపించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. రేపటిలోగా ఏపీలో రిపోర్టు చేయాలని ఇప్పటికే డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొత్తం ఐదుగురు ఐఏఎస్ లకు క్యాట్ లో చుక్కెదురైంది. రేపు యధావిధిగా ఆంధ్రప్రదేశ్ వెళ్లి రిపోర్ట్ చేయాలని తుది తీర్పునిచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి దాదాపు 3 గంటల సేపు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఐదుగురు పిటిషనర్లు ఆమ్రపాలి(జీహెచ్ఎంసీ కమిషనర్), రొనాల్డ్ రాస్(ఇంధన సెక్రటరీ), సృజన (ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), వాకాటి కరుణ(ఉమెన్ అండ్ చైల్ వెల్ఫేర్ సెక్రటరీ), వాణీ ప్రసాద్(టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ).. క్యాట్ ను ఆశ్రయించారు.
స్థానికత, రిజర్వేషన్, స్వాపింగ్ ఈ మూడు విషయాలకు సంబంధించిన దాంట్లో ప్రత్యూష సిన్హా కమిటీ ఎలాంటి స్థానికత చూపించలేదన్నారు. వన్ మెన్ కమిటీ రిపోర్టుని ఇంతవరకు బహిర్గతం చేయలేదన్నారు. డీవోపీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వాదనలు వినిపించారు. హైకోర్టులో తమ పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో సడెన్ గా ఏపీకి వెళ్లాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
ఐఏఎస్ ల పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన క్యాట్.. అనేక అంశాలను ప్రస్తావించింది. డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. తీర్పు పూర్తైన తర్వాత కూడా ఐఏఎస్ లు మరోసారి అభ్యర్థించారు. కానీ, వారికి ఉపశమనం లభించలేదు. కేవలం డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులనే క్యాట్ పరిగణలోకి తీసుకుంది.
మొత్తం ఐదుగురు ఐఏఎస్ లు ఉన్నారు. వీరిలో నలుగురు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్నారు. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఈ నలుగురిని డీవోపీటీ ఆదేశించింది. ఇక ఏపీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న సృజనను తెలంగాణలో రిపోర్ట్ చేయాలంది.
Also Read : మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు, ఫలితాల తేదీల పూర్తి వివరాలు..