Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

అన్నదాతలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది.

Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

Rythu Bandhu

Rythu Bandhu : అన్నదాతలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో రైతు ఖాతాల్లో జమకావాల్సిన రైతు బంధు నిధులు నిలిచిపోనున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అనుమతి ఉపసంహరిస్తున్నట్లు ఈసీ ప్రకటనలో తెలిపింది. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటనను ఈసీ ప్రస్తావించింది. ఈసీ తాజా నిర్ణయంతో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడనుంది.

Read Also : Rythu Bandhu : రైతులకు గుడ్‌న్యూస్.. 26న వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

ప్రతీయేటా వానాకాలం, యాసంగి సీజన్ లలో పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 5వేల చొప్పున రైతు బంధు పథకం  కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్ కోసం రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉండటంతో ఈ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. రైతు బంధు కొనసాగుతున్న పథకం అని, కోడ్ వర్తించదని, యథావిధిగా రైతు బంధు నిధులు విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. ప్రభుత్వం లేఖను పరిశీలించిన ఈసీ గత శుక్రవారం రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. అయితే, 2018 అక్టోబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని సూచించింది.

Read Also : PM Modi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో తిరుమలకు రావడం ఎన్నోసారో తెలుసా?

ఈనెల 28న సాయంత్రానికి ప్రచారం గడువు ముగుస్తున్నందున అప్పటి నుంచి ఈనెల 30న పోలింగ్ ముగిసే వరకు నిధులను జమ చేయొద్దని ఈసీ ఆదేశించింది. దీనికితోడు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం రైతు బంధు నిధుల విషయంపై ఎలాంటి ప్రస్తావన చేయొద్దని ఈసీ సూచించింది. అయితే, ఈనెల 28న రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. హరీశ్ రావు వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ పేర్కొంటూ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసింది. ఈసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 70లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం నిలిచిపోనుంది.