నేడు కలెక్టర్లు, ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ…పీఆర్సీ, పదోన్నతులపై చర్చ

CM KCR meet the collectors and employees unions today : వరుస భేటీలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం టీజీవోలు, టీఎన్‌జీవోలతో సమావేశమవుతారు కేసీఆర్. ఆ తర్వాత కలెక్టర్లు, టీజీవోలు, టీఎన్‌జీవోలతో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. కేసీఆర్‌తో సుమారు 350 మంది టీఎన్జీవో, టీజీవో నాయకులు భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో ముచ్చటించనున్నారని, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ సందర్భంగా టీఎన్జీవో నాయకులకు అక్కడే భోజనం ఏర్పాటు చేశారు. అందుకోసం ప్రగతి భవన్ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సమావేశంలో పలు అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. అలాగే.. ఉద్యోగుల జీతాల పెంపు, పీఆర్ఎస్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు లాంటి అంశాలపై టీజీవోలు, టీఎన్‌జీవోలతో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.