రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే : ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR review on Dharani : ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పెట్టిన తెలంగాణ సర్కార్… వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై దృష్టిపెట్టింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి.. వాటిని ఎలా పరిష్కరించాలి.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇవే అంశాలపై సీఎం కేసీఆర్ 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు :-
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. అనే విషయాలు చర్చించడానికి సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు :-
కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కారణంగా.. దాదాపు మూడు నెలలుగా తెలంగాణ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. కొద్ది రోజుల క్రితం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వం.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంలో మాత్రం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. మొన్నటి కేబినెట్ భేటీలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై నేటి సమావేశంలో కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
సాదాబైనామాల క్రమబద్దీకరణ :-
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలు లేకుండా చేయాలని భావించిన సీఎం కేసీఆర్.. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి భూ సంబంధిత వివాదాలన్నింటికి చరమగీతం పాడాలని నిర్ణయించారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అలాగే… సాదాబైనామా ఆస్తులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 12న సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
వ్యవసాయేతర భూముల నమోదుపై కేసు :-
దీంతో ఇప్పటివరకు ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ విషయంపై కోర్టుకు వెళ్లడంతో… సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. వ్యవసాయేతర భూముల నమోదుపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. భూముల నమోదు ప్రక్రియ సమయంలో ఆధార్ వివరాలు ఎంట్రీ చేయాల్సి వస్తోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే… గూగుల్ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలినవి మరో నాలుగు ఉన్నందున భద్రతా పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని కోర్టు చెప్పింది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
రిజిస్ట్రేషన్ల తేదీ ఖరారు :-
ఈ పరిస్థితుల్లో.. సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలపై దృష్టిపెడతారు. న్యాయపరమైన చిక్కులు కూడా ఉండడంతో వాటిని దృష్టిలో ఉంచుకొని ఎలా వ్యవహరించాలన్న అంశంపై సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం ద్వారానే రిజిస్ట్రేషన్ తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.