గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమీక్ష

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 01:21 PM IST
గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Updated On : November 12, 2020 / 1:59 PM IST

Greater Election : గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన అనూహ్య పరాజయంపైనా పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఆరేళ్లలో చవిచూసిన మొట్టమొదటి అపజయంతో కావడంతో… దాన్నుంచి త్వరగా బయటపడాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఏదైనా గట్టి విజయంతో దుబ్బాక ఓటమికి బదులివ్వడమే సరైన పరిష్కారంగా భావిస్తోంది. ఇందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను వేదిక చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రగత భవన్‌కు చేరుకున్నారు.

గ్రేటర్ ఫైట్ పై దృష్టి :-
దుబ్బాక ఉపఎన్నిక ముగిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద నవంబరు లేదా డిసెంబరులో గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది. కానీ, అనూహ్యంగా అక్టోబరు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే…ఇంకా ఆలస్యమైతే … ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందనే ఉద్దేశ్యంతో.. ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రేటర్‌ ఫైట్‌పై దృష్టిపెడుతోంది.

వంద సీట్లు టార్గెట్ :-
గతంలో వంద సీట్లు టార్గెట్‌గా పెట్టుకుని వ్యూహాలు రచించింది. అందుకు తగ్గట్లే లక్ష్యాన్ని సాధించింది. ఈసారి అంతకు మించి అనే రేంజ్‌లో గ్రేటర్‌పై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… పలుమార్లు సిటీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. గురువారం జరిగే సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణపై మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ లో ఎన్నికలు :-
ఈ సమావేశం అనంతరం గ్రేటర్‌ ఎన్నికలు ఎప్పుడనే దానిపై క్లారిటీ రానుంది. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం ఖరారయ్యే వీలుంది. ఇందులో జీహెచ్‌ఎంసీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. డిసెంబరులోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని, ఆలస్యం చేసే కొద్దీ ఇతర పార్టీలకు అవకాశమిచ్చినట్లు అవుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరితో ముగియనున్న గడువు :-
GHMC పాలక మండలికి వచ్చే ఏడాది ఫిబ్రవరితో గడువు ముగియనుండటంతో ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టింది. నవంబర్ 15న షెడ్యూల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పార్టీలను కోరింది. అన్నీ కుదిరితే డిసెంబర్‌లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో అవకతవకలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది బీజేపీ. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటరు జాబితా ఇవ్వాలని కోరింది. కార్పొరేటర్లతో కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించారని ఆరోపించింది.