Cm Revanth Reddy: దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

ఎన్నికల కోసం మందకృష్ణను బీజేపీ కౌగిలించుకుంది. అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు వర్గీకరణ చేయడం లేదు?

Cm Revanth Reddy: దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Updated On : February 28, 2025 / 7:54 PM IST

Cm Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. తాజాగా కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.

”బెదిరిస్తా అంటే నడవదు. కిషన్ రెడ్డి లాంటి వాళ్లు ఎంతోమంది వచ్చారు. దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు బీసీలో ఉన్నాయి. ఎన్నికల కోసం మందకృష్ణను బీజేపీ కౌగిలించుకుంది. అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు వర్గీకరణ చేయడం లేదు?

కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లే తెలంగాణకి అన్యాయం జరుగుతోంది. హిందీ భాషను దేశ ప్రజలపై రుద్దితే ఊరుకోను. ఎవరి మాతృభాష వారికి ముద్దు. కాంగ్రెస్ పార్టీ అన్ని భాషలకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగు భాషను కనుమరుగు చేస్తానంటే ఊరుకునేది లేదు.

Also Read : ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై డౌట్స్ ఉన్నాయా..? మీకో అప్డేట్..

డీ లిమిటేషన్ లో సీట్లు పెంచమని ఇండైరెక్ట్ గా అమిత్ షా చెబుతున్నారు. ఎన్ని పెంచుతారో చెప్పకుండా ఉన్న సీట్లు తగ్గవని అమిత్ షా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాదిని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం తప్పు. జనాభా నియంత్రణను దక్షిణ భారతదేశం పాటించింది. దక్షిణ భారత దేశాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ల పీఆర్వో ఒక్కరే. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కుల గణనలో పాల్గొనలేదు. కులగణనలో తప్పుంది అంటున్నారు. ఎక్కడ తప్పుందంటే చెప్పడం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయి. మనం కేంద్రానికి ఒక రూపాయి పన్ను కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చాయి. పదుల సార్లు ఢిల్లీకి వెళ్లా. ప్రధాని మొదలు ప్రతి మంత్రిని కలిశా. మీరు ఇన్ని సార్లు ఢిల్లీకి వస్తున్నారు, ఇన్ని సార్లు నివేదికలు ఇచ్చి వెళ్తున్నారు.. మరి మీ రాష్ట్రం నుంచే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదని కేంద్రమంత్రులు అన్నారు.

ఈ ఆరేళ్లలో ఒక్కసారైనా ప్రధాని దగ్గర అపాయింట్ మెంట్ తీసుకుని తెలంగాణకు ఇవి కావాలని మీరు నివేదిక ఇచ్చారా? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, మూసీ నది ప్రక్షాళనకు నిధులు కావాలనో, సెమీ కండక్టర్ కి అనుమతులు రావాలనో మీరు ప్రస్తావించారా?

ఒకవేళ ప్రస్తావించి ఉంటే ఏ మీటింగ్ లోనో చెప్పండి. ఏ పార్లమెంట్ సమావేశంలో మీరు మాట్లాడారో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ దిగిపోయారన్న బాధలో ఉన్న కిషన్ రెడ్డి మాకు అడ్డం పడుతున్నారు. కిషన్ రెడ్డి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ అనుమతులు తీసుకుని హైదరాబాద్ కి రండి.

ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో ప్రధాని మోదీ చెప్పారు. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. తెలంగాణలో బీసీ కులగణన చేస్తే.. కులగణనలో మైనార్టీలను చేర్చారు కాబట్టి.. మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తాం అంటున్నారు. కిషన్ రెడ్డిని సూటిగా అడుతున్నా.. ఏపీలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా. మీకు చేతనైతే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి. పక్క రాష్ట్రంలో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు లేవా?

Also Read : రేషన్ కార్డుకు అప్లయ్ చేసిన వారికి షాకింగ్ న్యూస్ ..

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీహార్ లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనార్టీలకు వస్తున్నాయి. మండల్ కమిషన్ రెకమండ్ చేసింది.

బీసీ ఉపకులాలలో మైనార్టీలు ఉన్నారని. దూదేకుల, నూర్ బాషా.. ఇలాంటి మైనార్టీ ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. కులగణన జరిగితే అధికారం కోల్పోతారనే దు:ఖంలో ఉన్న కిషన్ రెడ్డి.. బీసీ కులగణన మీద అడ్డం పడుతున్నారు” అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.