Cm Revanth Reddy : పరిపాలనపై సీఎం రేవంత్ ఫోకస్.. ఎన్నికల కోడ్ తర్వాత తొలిసారి సమీక్ష

తేమ, తరుగు సాకుతో కొర్రీలు పెడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.

Cm Revanth Reddy : పరిపాలనపై సీఎం రేవంత్ ఫోకస్.. ఎన్నికల కోడ్ తర్వాత తొలిసారి సమీక్ష

Updated On : May 16, 2024 / 12:18 AM IST

Cm Revanth Reddy : ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇక పరిపాలనపై ఫోకస్ పెట్టారు. ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్నదాతల సమస్యలపై రేవంత్ దృష్టి పెట్టారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్.. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తేమ, తరుగు సాకుతో కొర్రీలు పెడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ వస్తుండటంతో రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు సీఎం రేవంత్.

ఆగస్టు 15లోపు అమలవ్వాల్సిందే..
సరిపడ పత్తి విత్తనాలు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్. పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సీఎం.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలయ్యేలా సిద్ధం కావాలని సూచించారు. దీని కోసం త్వరలోనే బ్యాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఒకేసారి అన్నదాతలను రుణవిముక్తులను చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. ఇక ఈ వానా కాలం నుంచి రైతులకు ఎకరాకు 7వేల 500, రైతుకూలీలకు, కౌలుదారులకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు తీసుకున్న తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు.

ఆస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం..
మరో వైపు జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పులు పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. అలాగే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు.

తెలంగాణకు మాత్రమే రాజధానిగా హైదరాబాద్..
విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదన్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి అవుతూ ఉండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేళ్ల కాలానికి హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

Also Read : మినిమం 9, మ్యాగ్జిమం 13..! కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్