మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబుతో భేటీ గురించి అమిత్ షాకు చెప్పాం

మంత్రి వర్గ విస్తరణ, పీపీసీ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబుతో భేటీ గురించి అమిత్ షాకు చెప్పాం

cm revanth reddy interesting comments on cabinet expansion

Updated On : July 4, 2024 / 4:53 PM IST

cm revanth reddy on cabinet expansion: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పీపీసీ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా.. మీరే విస్తరించారు, మీరే వాయిదా వేశారు అంటూ చమత్కరించారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచే సరైన సమాధానం వస్తుందని చెప్పారు.

పీసీసీ చీఫ్ గా తన పదవీకాలం ముగిసేలోపు నూతన అధ్యక్షుడిని నియమించాలని కోరినట్టు చెప్పారు. ఈ విషయంలో నాకు ఏకాభిప్రాయం ఉంది.. నాకేం భిన్నాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. ”మంత్రివర్గాన్ని విస్తరణ జరగాలని, పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ తో చెప్పాను. ఈ రెండు అంశాలు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. మీరే విస్తరించారు. మీరే శాఖలు పంచారు. మీరే వాయిదా వేశార”ని సీఎం రేవంత్ సరదాగా అన్నారు.

చంద్రబాబుతో భేటీ గురించి అమిత్ షాకు చెప్పాం
ఈనెల 6న ఏపీ చంద్రబాబు నాయుడితో భేటీ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పామని వెల్లడించారు. విభజన సమస్యల పరిష్కారానికి చర్చించుకుని ముందుకెళతామన్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను కేంద్రం చూసుకుంటుందని, అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోతే రెండు రాష్ట్రాలు కలిసి చట్టపరంగా పరిష్కారం కనుగొంటామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది?
బీఆర్ఎస్ పార్టీకి గత చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదని, పార్లమెంటులో సింగిల్ సీటు కూడా లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎక్కడుందని టార్చిలైట్ వేసి వెతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలు కాదు కేసీఆర్ కూడా టార్చిలైట్ వేసి వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

Also Read : కాంగ్రెస్‌లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చేర్చుకోవద్దంటూ సెల్ టవర్ ఎక్కిన కార్యకర్త

కేసీఆర్‌పై ఈటలకు ప్రేమ తగ్గలేదు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా.. గతంలో కేసీఆర్ కిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌కు ఇంకా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్యానించారు.