తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం… బీజేపీ నేత ఇంటికి సీఎం రేవంత్

బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం… బీజేపీ నేత ఇంటికి సీఎం రేవంత్

Revanth Reddy Meet Jithender Reddy: లోక్‌స‌భ‌ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ స్వయంగా ఆహ్వానించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ రాకపోవడంతో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.

సీఎం స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో జితేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. మల్కాజ్ గిరి నుంచి పోటీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బీజేపీ టికెట్ ఆశించి జితేందర్ రెడ్డి భంగపడ్డారు. డీకే అరుణకు బీజేపీ టికెట్ ఇవ్వడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ కీలక నాయకుడైన జితేందర్ రెడ్డిని మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. సీఎం ఆఫర్ పై జితేందర్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సీఎం రేవంత్ వ్యూహం
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదుతున్నారు. తాను ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. దీనిలో భాగంగా ఆయన జితేందర్ రెడ్డిని కలిశారు. తమ పార్టీలో చేరితే మల్కాజ్‌గిరి టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలిసింది. రెండుసార్లు ఎంపీ, ఢిల్లీలో బలమైన సంబంధాలు ఉన్న జితేందర్ రెడ్డిని పోటీకి దించితే కచ్చితంగా గెలుస్తారని సీఎం రేవంత్ భావిస్తున్నారు. మరోవైపు తమ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ బరిలో నిలిపింది.

Also Read: కేసీఆర్‌కు ఆరూరి రమేశ్‌ షాక్.. బీజేపీలో చేరడానికి ఢిల్లీకి పయనం