ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా జనవరిలో..! బీఆర్ఎస్‌కు సీఎం సీఎం రేవంత్ వార్నింగ్..
నాకు మీలా డబ్బులపై ఆశ ఉంటే వేల కోట్లు వస్తాయి.

Cm Revanth Reddy : లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం, సంగం శివయ్యకు పూజలు చేసి మూసీ ప్రక్షాళనకు సిద్ధమయ్యామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నీరు విషంగా మారి కులవృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. పాలకుల నిర్లక్ష్యంతో నడుము వంకరతో బిడ్డలు పుడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ తెలంగాణలో పుట్టి తెలంగాణలో ప్రవహిస్తూ కృష్ణలో కలుస్తుందన్నారు. జన్మదినం అంటే మందు విందుతో దావత్ చేసుకుంటారు.. కానీ ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలు నాతో కలిసి నడిచారు అని సీఎం రేవంత్ అన్నారు.
”మూసీలో ఈరోజు చందమామ చేపలు పెంచే పరిస్థితి లేదు. హైదరాబాద్ కు నల్గొండ జిల్లా కూరగాయలు, పాలు వచ్చేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. గీతన్నలు, ముదిరాజులు వలస పోతున్నారు. చరిత్రలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ కు దోచుకోవడమే తెలుసు. నల్గొండ బాగుపడాల వద్దా? బీఆర్ఎస్, బీజేపీలను అడగండి. బీఆర్ఎస్, బీజేపీ కాళ్ళల్లా కట్టెలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
హిరోషిమా, నాగసాకి ఎదుర్కొన్న పరిస్థితి మూసీతో హైదరాబాద్ ఎదుర్కొంటుంది. నగరం నాశనం అవుతుంది. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారింది. నాకు మీలా డబ్బులపై ఆశ ఉంటే వేల కోట్లు వస్తాయి. సబర్మతి అద్భుతం అంటున్న నకిలీ బీజేపీ నేతలు మూసీ బాగొద్దా..? ఈరోజు నా జన్మ ధన్యమైంది. మూసీ ప్రక్షాళనకు సంకల్పం తీసుకున్నా. మూసీ ప్రక్షాళన చేసి తిరుగుతా. వెంకన్నను బుల్డోజర్ ఎక్కిస్తా. శ్యామ్యూల్ తో జెండా ఊపిస్తా. బుల్డోజర్ కు అడ్డంగా వస్తే తొక్కిస్తా.
మీరు ఇస్తే నాకు చిన్న వయస్సులో సీఎం పదవి వచ్చింది. అధికారం ఇచ్చింది మీరు. మీకు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది. మీ బిడ్డ మూడు నెలలు జైలుకెళితే దు:ఖం వచ్చింది. నల్గొండ బిడ్డల వంకర బతుకులు చూడవా కేసీఆర్? నల్గొండ ప్రజలు బిల్లా రంగాల వైపు ఉంటారో.. మా వైపు ఉంటారో తేల్చుకోండి. చరిత్ర హీనులుగా మారకండి. సంగెం శివయ్య సాక్షిగా.. మూసీని ప్రక్షాళన చేస్తాం. బిల్లా, రంగా, చార్లెస్ శోభరాజ్ కు సవాల్. జనవరిలో వాడపల్లి నుండి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తా. ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. సినిమా జనవరిలో చూడండి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : మోదీతో మైహోం రామేశ్వరరావు, రామురావు భేటీ.. రామును ఆప్యాయంగా హత్తుకొని అభినందించిన మోదీ